BJP Speed up Election Campaign in Telangana : తెలంగాణ గడ్డపై కాషాయజెండా ఎగురవేయడమే లక్ష్యంగా కమలనాథులు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. పాలమూరు గడ్డ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi).. మూడు రోజుల వ్యవధిలోనే రెండుసార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఓవైపు రాష్ట్రంపై వరాల జల్లు కురిపిస్తూనే.. మరోవైపు బీఆర్ఎస్ సర్కారుపై నిప్పులు చెరిగారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు, తెలంగాణ అధ్యక్షుడు మార్పు తర్వాత.. రాష్ట్ర పార్టీ శ్రేణుల్లో నెలకొన్న నిస్తేజాన్ని ప్రధాని పర్యటన కొంతమేర తగ్గించిందని చెప్పుకోవచ్చు. కమలదళపతి జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా (Amit Shah), రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ, సాధ్వీ నిరంజన్ జ్యోతి ఒక దఫా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రెండుసార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. మరో మూడు సార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రానున్నారు.
PM Narendra Modi Telangana Tour :ఈ నెల 7, 11 తేదీల్లో ప్రధాని రాష్ట్రానికి రానున్నారు. 7న హైదరాబాద్‌లో నిర్వహించే బీసీ ఆత్మ గౌరవ సదస్సులో పాల్గొననున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ సామాజిక వర్గానికి చెందని వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో.. కమలం పార్టీ ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఈ సభకు నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానుండటంతో బీసీ నినాదం క్షేత్రస్థాయిలో బలంగా వెళ్తుందని కాషాయదళం భావిస్తోంది. 11న మాదిగ, ఉపకులాల విశ్వరూప మహాసభకు ప్రధాని హాజరుకానున్నారు. తెలంగాణ పర్యటన సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి ఎన్నికల్లో విజయం సాధించేలా దిశానిర్దేశం చేయనున్నారు.
నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన వెంటనే ప్రచారాన్ని ఉద్ధృతం చేయాలని కమలం పార్టీ భావిస్తోంది. ఈ నెల 15 నుంచి ప్రచారాన్ని హోరెత్తించనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వశర్మ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, జాతీయ నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఈ నెల 19 తర్వాత మరోసారి ఎన్నికల ప్రచారానికి రాష్ట్రానికి రానున్నారు. ప్రధాని తొమ్మిదేళ్ల అభివృద్ధి, సంక్షేమ పథకాలు, తెలంగాణకు కేటాయించిన నిధులు, బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను.. బీజేపీ నాయకులు ఎండగట్టనున్నారు. ఎన్నికల వేళ కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోవడం కమలం పార్టీకి ఒక అస్త్రంగా దొరికింది. భారత్ రాష్ట్ర సమితి అవినీతి సర్కార్ అని ఆరోపిస్తూ వస్తున్న భారతీయ జనతా పార్టీ దీనిని ప్రచారాస్త్రంగా వినియోగించనుంది.
Kishan Reddy on Opponent Parties : తెలంగాణలో సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం : కిషన్ రెడ్డి