రాష్ట్రంలో రాజకీయాలు మళ్లీ ఊపందుకున్నాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతోన్న కమలనాథులు.. అందుకు తగిన ప్రణాళికలు రచిస్తున్నారు. పార్టీ రాష్ట్ర రథసారథి బండి సంజయ్ అందుకు అనుగుణంగా వేగంగా పని చేస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌కు కొంత విరామం ఇచ్చిన భాజపా రాష్ట్ర నాయకత్వం.. మళ్లీ ముమ్మరం చేసింది. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన వెంటనే ఈటల రాజేందర్‌ను భాజపాలోకి లాగేందుకు చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ జడ్పీ మాజీ ఛైర్మన్ తుల ఉమలు.. ఇవాళ జేపీ నడ్డా సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని సాధ్యమైనంత త్వరగా... భాజపాలోకి తీసుకురావాలని యోచిస్తోంది. గతంలో చర్చలు జరిపి నిశ్శబ్థంగా ఉన్న కమలనాథులు ఈటలతో పాటు.. వీళ్లను సైతం భాజపాలోకి రావాలంటూ పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ ఒక కొలిక్కి మాత్రం రాలేదు. తెరాసలోని అసంతృప్తులు, మాజీ ఎమ్మెల్యేలను... భాజపాలో చేర్చుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది.
ప్రతివ్యూహాలపై కసరత్తు
హుజూరాబాద్ ఉప ఎన్నికను భాజపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అధికార తెరాస, కేసీఆర్ వ్యూహాలకు ప్రతి వ్యూహాలను కమలనాథులు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక వస్తే... ఈటల రాజేందర్‌కు సరితూగే నేత తెరాసలో లేరని.. భాజపా నేతలు చెబుతున్నారు. గత 17 ఏళ్లుగా ఈటల రాజేందర్ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భాజపా నిర్ణయించింది.