త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు భాజపా రాష్ట్ర నాయకత్వం పక్కా ప్రణాళికలు రచిస్తోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. భాజపా ఇటీవల మేడ్చల్ అర్బన్, రూరల్, రంగారెడ్డి అర్బన్, రూరల్‌తో పాటు అంబర్‌పేట, గోల్కొండ జిల్లాలుగా విభజించి అధ్యక్షులను నియమించింది. ఈ జిల్లా కమిటీలు బల్దియా పోరును దృష్టిలో పెట్టుకుని... ప్రజా సమస్యలపై పోరాడుతూ వస్తున్నాయి. ఎన్నికల వేడి ప్రారంభం కావడంతో కమలనాథులు జిల్లాల వారిగా ఇప్పటికే సన్నాహాక సమావేశాలు నిర్వహించారు. భాజపా రాష్ట్ర నాయకత్వం సైతం పలుమార్లు సమావేశమై... గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించింది. పార్టీ శ్రేణులు ప్రజల్లోకి ఎలా వెళ్లాలనే అంశాలపై దిశానిర్థేశం చేసింది.
ప్రత్యేకతను చాటుకుంటూ...
జీహెచ్‌ఎంసీ ఎన్నికల పర్యవేక్షణ కోసం భాజపా జాతీయ నాయకత్వం ఆ పార్టీ ప్రధానకార్యదర్శి భూపేంద్ర యాదవ్ నేతృత్వంలో ఐదుగురు ఇన్ఛార్జ్లను నియమించింది. ఈ ఎన్నికల పర్యవేక్షణ మొత్తాన్ని భూపేంద్ర పర్యవేక్షించనుండగా... జీహెచ్‌ఎంసీ పరిధిలోని జిల్లాలను మిగతా ఇన్ఛార్జ్లు పర్యవేక్షించనున్నారు. నగరంలో గుజరాతీలు, మరాఠీలు అధిక సంఖ్యలో ఉండడంతో ఆ రాష్ట్రాలకు చెందిన నేతలను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించి ప్రత్యేకతను చాటుకుంది. వీరితో పాటు మరో 23 మందితో ఎన్నికల నిర్వహణ కమిటీని నియమించింది. ఈ కమిటీకి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఛైర్మన్‌గా వ్యవహారించనున్నారు. లక్ష్మణ్, డీకే అరుణ, మురళీధర్‌రావుతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీనియర్ నేతలకు ఈ కమిటీలో చోటు కల్పించింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు.. ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రాతినిథ్యం వహిస్తోన్న గోషామహాల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువ సీట్లు గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు.