2023లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా భాజపా(bjp) పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(bandi sanjay) ‘ప్రజాసంగ్రామ యాత్రకు శ్రీకారం చుట్టారు. చార్మినార్(charminar) భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి సమరశంఖం పూరించారు. రాష్ట్ర ప్రజల్లో విశ్వాసం, ఆత్మస్థైర్యం కల్పించేందుకే ఈ యాత్ర చేపట్టినట్టు బండి సంజయ్ చెప్పారు. రాజకీయ మార్పునకు వేదిక కానుందని అన్నారు. ఈ యాత్రను భాజపా జాతీయనేత అరుణ్‌సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. మొదటి రోజు పాతబస్తీలో 10కిలోమీటర్ల వరకు పాదయాత్ర కొనసాగనుంది.
మాయ మాటలతో మోసం
పాతబస్తీలో ఎంఐఎం(aimim) ఆగడాలను తట్టుకుని హిందువులు జీవిస్తున్నారని ఆయన మండి పడ్డారు. పాతబస్తీ వదిలివెళ్లిన హిందువులంతా ధైర్యంగా తిరిగిరావాలని స్పష్టం చేశారు. మాయమాటలతో మభ్యపెడుతూ అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తామని ఏడేళ్లు దాటినా... ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. దళితుడిని సీఎం చేస్తామని చెప్పి మాట తప్పారని గుర్తు చేశారు. ప్రజాసంగ్రామ యాత్రకు(Praja Sangrama Yatra) వచ్చిన అందరికీ బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1400 మంది బలిదానాలు చేశారు. అమరుల ఆకాంక్షలు, ఆశయాలకు భిన్నంగా ఒక్క కుటుంబమే పాలిస్తోంది. ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాక తెలంగాణలో ఏ ఒక్క వర్గానికి మేలు జరగలేదు. దళితులకు మూడెకరాల భూమి హామీని నెరవేర్చలేదు. ఉద్యోగాల కోసం 30లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యమ సమయంలో రాష్ట్రం కోసం... రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగం కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా నిరుద్యోగుల ఆత్మహత్యలు తగ్గడం లేదు.
-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
బీసీలకు వెన్నుపోటు
తెరాస ప్రభుత్వం బీసీలకు వెన్నుపోటు పొడుస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(kishan reddy) ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఒక్క టీచరు పోస్టు కూడా భర్తీ చేయలేదని మండిపడ్డారు. త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ విమోచన దినోత్సవాలు జరపించాలని సవాల్ చేశారు.