తెలంగాణలో 2023 నాటికి అధికారం చేజిక్కించుకోవాలని భాజపా ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా అడుగులు వేస్తోంది. హుజూరాబాద్ ఉపఎన్నిక, కరోనా సంక్షోభంలో ప్రజల ఇబ్బందులు, తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం, ప్రభుత్వ వైఫల్యాలు వంటి అస్త్రాలతో విరుచుకుపడేందుకు పక్కా ప్రణాళిక రచిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర కార్యాలయంలో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక సన్నాహక సమావేశం, కార్యవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశాల్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జీ తరుణ్ చుగ్ సహా సీనియర్ నేతలు పాల్గొన్నారు. తొలుత హుజూరాబాద్ ఉపఎన్నికపై జరిగిన సమావేశంలో ఈటల గెలుపునకు నిర్విరామంగా కృషి చేయాలని నియోజకవర్గ, మండల ఇన్‌ఛార్జీలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం భాజపా రాష్ట్ర కార్యవర్గం సమావేశం కాగా... ఇటీవల మరణించిన పార్టీ ఉమ్మడి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డికి నివాళులు అర్పించారు. కీలక నేతలంతా రాష్ట్ర కార్యాలయంలో సమావేశంలో పాల్గొనగా ఆయా జిల్లాల నేతలు జూమ్ ద్వారా వర్చువల్‌గా పాల్గొన్నారు.
మహా పాదయాత్ర
తెరాస పాలనపై నిప్పులు చెరిగిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా... ప్రజస్వామిక తెలంగాణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 9 నుంచి మహా పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభించి.. హుజూరాబాద్‌లో ముగిస్తానని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసమే తెలుగు రాష్ట్రాల సీఎంలు జల వివాదం రాజేస్తున్నారని ఆరోపించారు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీల కోసం అపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ సంతకం చేశారని... ఆ విషయంపై భాజపా అప్పుడే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు.