BJP Operation Akarsh on Congress leaders: కాంగ్రెస్ అసంతృప్త నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రహస్యంగా భేటీ అయి ఇప్పటికే ఒక దఫా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. చర్చలు సఫలమైతే బీజేపీలో చేరబోయే కాంగ్రెస్ నేతలను వెంటనే పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాలని కాషాయ పార్టీ చూస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలహీనం చేస్తే బీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉందనే సందేశాన్ని ప్రజల్లోకి పంపించాలని కమలనాథులు భావిస్తున్నారు. అయితే.. కాంగ్రెస్ నేతలను చేర్చుకోవడంపై దృష్టిసారిస్తున్న భాజపా రాష్ట్ర నాయకత్వం.. హస్తం పార్టీ నేతల సమన్వయ బాధ్యతలను కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నేతలకు అప్పగించింది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలతో బీజేపీ సీనియర్ నాయకురాలు ఫోన్‌లో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.
ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరదీసిన కాషాయదళానికి కాంగ్రెస్ అంతర్గత కలహాలు అస్త్రంగా మారాయి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే నానుడిని నిజం చేస్తూ కమలనాథులు చేరికలపై యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసుకున్నారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేక వర్గమంతా ఇప్పటికే ఏకతాటిపైకి వచ్చింది. తిరుగుబాటుకు సిద్ధమైన 9 మంది నేతల్లో పలువురు బీజేపీ నేతలకు టచ్‌లోకి వెళ్లినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్లతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంతనాలు జరిపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.