BJP Nirudyoga March Against TSPSC Paper Leak Case: బీజేపీ రాష్ట్రంలో అందివచ్చిన ప్రతిఅవకాశాన్ని అందిపుచ్చుకుంటూ కేసీఆర్ సర్కారు వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగడుతోంది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీపై వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీని పెద్దఎత్తున నిరసన ప్రదర్శలు చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ పార్టీ జాతీయ అధినాయకత్వం సూచనతో పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాలని కమలనాధులు నిర్ణయించారు.
ఇప్పటికే ప్రశ్నాపత్రం లీకేజీపై వివిధరూపాల్లో బీజేపీ రాష్ట్రనాయకత్వం ఆందోళనలు నిర్వహిస్తోంది. ఇది ఎన్నికల ఏడాది కావడంతో మరింత దూకుడుగా ముందుకుసాగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలను ఎండగడుతూనే.. పార్టీ అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇస్తూ వస్తోంది. నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్‌లైన్‌ను కేసీఆర్ సర్కారు పూర్తిగా విస్మరించిందంటూ.. పెద్ధఎత్తున ప్రచారం చేస్తున్న కమలనాధులు.. అధికారంలోకి వస్తే ఆ ట్యాగ్‌లైన్‌ను అమలుచేస్తామని హామీ ఇస్తోంది.
ప్రశ్నపత్రాల లీకేజీ అంశంపై ఇప్పటికే.. గన్‌పార్కు, అమరవీరుల స్థూపం వద్ధ నిరసన దీక్ష, ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ధ నిరుద్యోగ మహాధర్నాను చేపట్టిన కమలదళం.. నిరుద్యోగ మార్చ్‌కు సిద్ధమైంది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టమైన మిలియన్ మార్చ్ స్ఫూర్తితో.. నిరుద్యోగ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఏప్రిల్ 2నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ మార్చ్‌చేపట్టనున్నట్లు వెల్లడించింది.