తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేసీఆర్ సర్కార్​పై యుద్ధం ప్రారంభించాం.. ఏడాదిలో బీజేపీని అధికారంలోకి తెస్తాం' - ఎమ్మెల్యేలకు ఎర కేసు

BL Santhosh Comments: రాష్ట్రంలో ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ అన్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో అ.ని.శా. కోర్టు ఇచ్చిన తీర్పు.. తమపై కుట్రకు పాల్పడిన వారికి చెంప చెల్లు మనేలా ఉందని పేర్కొన్నారు. డ్రగ్స్ దందా చేసేదీ కేసీఆర్ కుటుంబ సభ్యులే అని ఆరోపించారు.

B L santhosh
B L santhosh

By

Published : Dec 7, 2022, 5:31 PM IST

BL Santhosh Comments: ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్‌ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. దీనిపై భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. అ.ని.శా. కోర్టు ఇచ్చిన తీర్పు తమపై కుట్ర మోపిన వారికి చెంప చెల్లు మనేలా ఉందన్నారు. భారత మాత, ధర్మం కోసం పనిచేసే వారిపై కేసీఆర్ కుట్ర చేసారని ఆరోపించారు.

డ్రగ్స్ దందా చేసేది సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులే అన్న బీఎల్ సంతోష్... బెంగళూరు డ్రగ్స్ కేసును తిరిగి తోడుతామని పేర్కొన్నారు. ఒకసారి బీజేపీకి అవకాశం ఇచ్చి... కాషాయపు జండాను ఆదరించండన్నారు. 80 శాతం హిందువుల కోసం పని చేసేది బీజేపీ అని అన్నారు. పార్టీ కోసం యుద్ధం చేసే వారికి బీజేపీ అండగా ఉంటుందన్నారు. హిందువుల సనాతన ధర్మాన్ని కించపరిస్తే భరించలేం అని వ్యాఖ్యానించారు. హిందువుల బాగు కోసం పనిచేస్తున్నామని బీఎల్ సంతోష్ తెలిపారు. తమకు జైలు కొత్త కాదన్న ఆయన... కేసీఆర్ కూతురు లాగ సారా కేసులో వెళ్లలేదని పేర్కొన్నారు. కేసీఆర్ సర్కార్​పై యుద్ధం ప్రారంభించాం.. ఒక ఏడాదిలో బీజేపీని అధికారంలోకి తెస్తామని బీఎల్ సంతోష్ వ్యాఖ్యానించారు.

ఇదీ జరిగింది.. ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, డా.జగ్గుస్వామి, తుషార్‌ వెల్లాపల్లి, బూసారపు శ్రీనివాస్‌లను నిందితులుగా చేర్చాలంటూ సిట్‌ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. ‘‘మొదటి ముగ్గురు నిందితుల నేరాంగీకార వాంగ్మూలంలో ఎక్కడా ఈ నలుగురి పేర్లు లేవు. ఎఫ్‌ఐఆర్‌, రిమాండ్‌ రిపోర్ట్‌ తదితరాల్లోనూ ఈ నలుగురి పాత్రపై ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ‘అవినీతి నిరోధక చట్టం కింద కేసుల్ని శాంతిభద్రతల పోలీసులుగాని, సిట్‌గాని దర్యాప్తు చేయకూడదనే అంశాన్నీ న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంటోంది.

ఏసీబీ లాంటి స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ మాత్రమే ఇలాంటి కేసుల్ని విచారణ చేయొచ్చు. ఈ అంశాల ఆధారంగా ఆ నలుగురిని నిందితులుగా గుర్తించాలనే దర్యాప్తు అధికారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవడం లేదు’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కేసు దర్యాప్తులో ఈ నలుగురికి సంబంధించి సాంకేతిక ఆధారాల్ని సేకరించామని సిట్‌ తరఫున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అంతకుముందు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అయితే అవినీతి నిరోధక చట్టం కింద కేసును విచారించే అర్హత సిట్‌కు లేదని నిందితుల తరఫు న్యాయవాది వాదించారు.ఈ కేసులో ఇప్పటికే రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌ నిందితులుగా ఉన్నారు.

గత అక్టోబరు 26న మొయినాబాద్‌ ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వీరిని సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. నిందితుల్ని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. అనంతరం కేసు దర్యాప్తును ప్రభుత్వం సిట్‌కు అప్పగించింది. సిట్‌ దర్యాప్తులో బీఎల్‌ సంతోష్‌, కేరళ వైద్యుడు జగ్గుస్వామి, ఎస్‌ఎన్‌డీపీ నేత తుషార్‌ వెల్లాపల్లి, కరీంనగర్‌ న్యాయవాది బూసారపు శ్రీనివాస్‌లను నిందితులుగా గుర్తిస్తూ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. తాజాగా ఆ మెమో తిరస్కరణకు గురైంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details