MP Laxman Fires on KTR : మంత్రి కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ పార్లమెంట్ బోర్డు సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు. లక్షా 27 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్న కేటీఆర్... శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజా ధనంతో విదేశీ పర్యటనలు చేశారు కానీ... టీఎస్ఐపాస్ ద్వారా ఎన్ని కంపెనీలు వచ్చాయో చెప్పాలన్నారు. వందల ఎకరాల భూములను కారు చౌకగా అస్మదీయులకు, బంధువులకు ధారాదత్తం చేస్తున్నారని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బతుకమ్మ చీరలు కూడా గుజరాత్ నుంచి తెప్పించారు : ప్రభుత్వం జారీ చేసే జీవోలు ఎందుకు వెబ్సైట్లో పెట్టడంలేదని ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. ఎందుకంత పారదర్శకత లేకుండా భయపడుతున్నారని నిలదీశారు. ఇంటింటికి ఫైబర్ అన్నారు... ఏమైంది ఐదేళ్లయినా ఊసే లేదని ఆయన విమర్శించారు. ఈశాన్య రాష్ట్రాల గ్రామాల్లో ఉన్నట్టుగా కూడా ఇంటర్నెట్ తెలంగాణలో లేదని ఎద్దేవా చేశారు. బతుకమ్మ చీరలు కూడా గుజరాత్ నుంచి తెప్పించారు తప్పితే... ఇక్కడ చేనేత కార్మికులకు ఉపాధి కూడా ఇవ్వలేకపోయారని లక్ష్మణ్ దుయ్యబట్టారు. మోదీ సర్కారు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ తెరిపించందని... తమరేం చేశారో చెప్పాలని బీఆర్ఎస్ నేతలకు లక్ష్మణ్ సవాల్ విసిరారు. ఎన్ని కంపెనీలకు భూములు ఇచ్చారు... ఎన్ని ఉద్యోగాలు వచ్చాయన్న అంశాలపై దమ్ముంటే శ్వేత పత్రం ఇవ్వాలన్నారు.