BJP MLAs on Congress Manifesto : బీజేపీ ఎమ్మెల్యేలు ఎట్టకేలకు ఈరోజు అసెంబ్లీలోకి(Telangana Assembly) అడుగు పెట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకపోతే అసెంబ్లీ వేదికగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
బీజేపీ శాసనసభాపక్షనేత ఎవరో? - కొనసాగుతున్న ఉత్కంఠ
BJP MLAs take Oath in Assembly Today : రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు చెల్లింపులను ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం చెల్లించాల్సిన అవసరం ఉందని బీజేపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన విధంగానే ఈ సర్కార్ కూడా రైతుబంధును ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తోందని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రైతుబంధును ఐదెకరాల కంటే ఎక్కువ ఉంటే ఇవ్వరనే సమాచారం తమకు అందుతోందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడా ఈ అంశాన్ని పేర్కొనలేదని తెలిపారు.
"రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు చెల్లింపులను ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం చెల్లించాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో ఇచ్చిన విధంగానే ఈ సర్కార్ కూడా రైతుబంధును ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తోంది. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం ఎకరాకు రూ. 15000 రైతుబంధును ఇవ్వాలి. రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఎప్పటి వరకు చేస్తారో స్పష్టం చేయాలి". - ఏలేటి మహేశ్వర్ రెడ్డి, నిర్మల్ ఎమ్మెల్యే