స్వాతంత్ర్య దినోత్సవం రోజు జాతీయ జెండాను ఎగురవేసేందుకు, ర్యాలీ నిర్వహించేందుకు పోలీసుల అనుమతి తీసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి.. రాష్ట్రంలో ఉండటం బాధాకరమని హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. రేపు పంద్రాగస్టు సందర్భంగా ర్యాలీకి అనుమతి ఇవ్వాలని భగత్ సింగ్ యువసేన అధ్యక్షుడు శైనథ్గంజ్ పోలీసులను కోరితే వారు నిరాకరించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితి లేదని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
ప్రతి సంవత్సరం గోషామహల్ నియోజకవర్గంలోని షహినయాత్గంజ్ పోలీస్ స్టేష్న్ పరిధిలో ఆగస్టు 15న చిన్నపాటి ర్యాలీ తీస్తారని రాజాసింగ్ అన్నారు. జాతీయ పతాకాలతో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంటుందని చెప్పారు. రెండేళ్ల క్రితం ర్యాలీ తీసినందుకు ట్రాఫిక్ జామ్ అయిందనే సాకుతో కొందరిపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. ఈ సారి కూడా అనుమతి అడిగితే పోలీసులు నిరాకరించారని వెల్లడించారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక జాతీయ పతాకం ఎగురవేయాలంటే అనుమతి తీసుకోవాల్సి రావడం సిగ్గుచేటని రాజాసింగ్ మండిపడ్డారు. కేసులు పెడతాం, రౌడీషీట్ తెరుస్తామని బెదిరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.