Raghunandan Rao on Cm Kcr: తెలంగాణ సెంటిమెంట్‌ను మరోసారి రగిల్చి ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో తెరాస ఉన్నట్లు తాము భావిస్తున్నామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ప్రధాని మోదీని తిట్టినా కూడా... ఆయన కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పినట్లు తెలిపారు. తెలంగాణలో అలజడి సృష్టించే ప్రయత్నం తెరాస చేస్తోందనే అనుమానం కలుగుతోందన్నారు. ఉత్తర, దక్షిణ భారతదేశం అనే భావన తీసుకురావొద్దని ఆయన కోరారు. ఏ అంశంపైనా అయిన చర్చకు తాము సిద్ధమని మంత్రి హరీశ్‌రావుకు సవాల్ విసిరారు. ఎయిమ్స్, హార్టికల్చర్ యూనివర్సిటీ ఇచ్చామన్న రఘునందన్‌రావు... శత్రువును కూడా గౌరవించే సంస్కారం తమదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భాజపా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.
భాజపా ఎంపీలు ఓటేస్తేనే...
భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన రఘునందన్‌రావు పలు అంశాలపై మాట్లాడారు. ఉత్తర భారత దేశానికి చెందిన భాజపా ఎంపీలు ఓటు వేస్తేనే తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ అయిందని గుర్తుచేశారు. సుష్మాస్వరాజ్ చెప్పిన మాట మీద నిలబడి తెలంగాణ కోసం ఉత్తర భారతదేశ ఎంపీలు అండగా ఆనాడు ఉన్నారన్నారు. కేటీఆర్ అమెరికాలో ఉన్నప్పుడే నరేంద్రమోదీ గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నారు అనేది మర్చిపోవద్దని చురకలంటించారు. హరీష్ రావు ఎమ్మెల్యేనే... రఘునందన్ రావు కూడా ఎమ్మెల్యేనే స్థాయి ఏంటో చెప్పాలని కోరారు. తెలంగాణ కోసం బలిదానాలు 2009 నుంచే జరుగుతున్నాయన్నారు.
ప్రజల్లో నమ్మకం కోల్పోయినందుకే మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది బాధకరమైన విషయం. మన రాష్ట్రాల గురించి మాట్లాడరు. పక్క రాష్ట్రాల గురించి మాట్లాడతారు. మందికి పుట్టిన బిడ్డను మాది అని భాజపా వాళ్లు అంటారంటా. మీ జన్మదినం సందర్భంగా నేను సూటిగా అడుగుతున్న. ఇవాళ అయినా కనీసం నిజం మాట్లాడండి. ఎవరు మందికి పుట్టిన బిడ్డనో ఆలోచించండి. తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టింది కాంగ్రెస్.. మద్దతుగా నిలిచింది భాజపా. ఆరోజు మీ సంఖ్య రెండు. ఓటింగ్‌లో పాల్గొంది ఒకరు. వచ్చింది తెలంగాణ. కాంగ్రెస్-భాజపా ఈ పార్టీలు నిర్ణయం తీసుకుంటే పుట్టిన బిడ్డ తెలంగాణ. ఇది మంది బిడ్డనా? మన బిడ్డనా?