కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. తెరాస ప్రభుత్వ తీరుపై హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో విమర్శలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలు చర్చించకుండా... ప్రతిపక్షాలపై ఆరోపణలు చేస్తూ రాజకీయాలు చేశారని విమర్శించారు. కోచ్ ఫ్యాక్టరీకి జనవరిలో భూమలు ఇచ్చి... ఇప్పుడు రాద్దాంతం చేస్తున్నారని అన్నారు.
కేంద్రం చెప్పలేదు
కోచ్ ఫ్యాక్టరీ కోసం తెరాస ఎంపీలతో ఎందుకు నిరసన వ్యక్తం చేయించలేదని ప్రశ్నించారు. కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్లాంట్ ఇస్తామని భాజపా ఎప్పుడూ చట్టంలో చెప్పలేదని తెలిపారు. బయ్యారంపై 2014 డిసెంబర్‌లోనే టెక్నికల్ కమిటీ కేంద్రానికి రిపోర్టు అందజేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం ఉంటే చెప్పమని కేంద్రం చెబితే.. ఇప్పటికీ స్పందించలేదని ఆక్షేపించారు. బయ్యారం ప్లాంట్ పెడతామని 2018లో కేటీఆర్ కొత్తగూడెంలో స్వయంగా ప్రకటించారని గుర్తుచేశారు.