Raghunandan fire on Pilot Rohit Reddy: టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి విద్యార్హతలపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆయన 2009 ఎన్నికల అఫిడవిట్‌లో బీటెక్ (ఎంఎస్) స్వీడన్లో పూర్తి చేసినట్లు పేర్కొన్నారనీ.. 2014 ఎన్నికల అఫిడవిట్‌లో మాత్రం ఇంటర్మీడియట్ చదివినట్లు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. 'అంటే 2009లో ఇంజినీరింగ్ చేసిన వ్యక్తి.. మళ్లీ 2014లో ఇంటర్ చేస్తాడా' అని ప్రశ్నించారు. ఈడీ అధికారులు అందుకే ఆయన బయోడేటా తెమ్మన్నారని ఎద్దేవా చేశారు.
ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇస్తే అధికారులు కేసులు నమోదు చేస్తారన్నారు. భారత ఎన్నికల సంఘానికి రోహిత్ రెడ్డి విద్యార్హత మీద ఫిర్యాదు చేస్తున్నట్లు రఘునందన్ పేర్కొన్నారు. ఈడీ కేసును వేగవంతం చేయాలని బండి సంజయ్ సూచినట్లు హరీశ్‌రావు అన్న వ్యాఖ్యలపై రఘునందన్ స్పందించారు. ఈడీ గురించి బండి సంజయ్ వ్యాఖ్యానించిన ప్రెస్ మీట్ చూసి హరీశ్‌రావు మాట్లాడాలనీ హితవు పలికారు. హరీశ్‌రావు ఎమ్మెల్యే కాకముందే అడ్డదారిలో మంత్రి అయ్యారని విమర్శించారు.