BJP MLA Maheshwar Reddy vs Ministers in Telangana Assembly :శాసనసభలో గవర్నర్(Governor) ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై జరుగుతున్న చర్చలో బీజేపీ సభ్యులు, మంత్రుల మధ్య వాగ్వాదం (BJP vs Congress) తారాస్థాయికి చేరింది. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు చేయడానికి 100 రోజుల సమయం ఇస్తున్నామని బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరించారు. మరోవైపు మంత్రులు కూడా బీజేపీపై కౌంటర్లు వేస్తూ విరుచుకుపడ్డారు.
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన 412 హామీల గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. రోజూ ప్రజా దర్బార్(Praja Darbar) అని చెప్పి.. ఇప్పుడు వారానికి రెండు రోజులకే పరిమితం కావడంపై దుయ్యబట్టారు. అలాగే ప్రగతి భవన్‌ను స్టడీ సెంటర్ చేస్తామని చెప్పి ఇప్పుడు దానిని ప్రజా దర్బార్‌గా చేశారని విమర్శించారు. మరో భవనాన్ని భట్టికి అధికారిక నివాసం చేశారని మండిపడ్డారు.
ప్రజల హామీలను నెరవేర్చకపోతే బీజేపీ ఊరుకోదు : అప్పులు చూపించి హామీలను నెరవేర్చకుండా తప్పించుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని మహేశ్వర్ రెడ్డి(BJP MLA Maheshwar Reddy) ధ్వజమెత్తారు. ప్రజల హామీలను నెరవేర్చకపోతే బీజేపీ ఊరుకోదని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అమలు కాని హామీలను ఇచ్చిన కాంగ్రెస్, ఇలా ఎన్ని హామీలను ఇచ్చినా ప్రజలు బొటాబొటి మెజార్టీనే ఇచ్చారన్నారు. రేవంత్ రెడ్డి అదృష్టవంతుడు, ఒక చోట ఓడిపోయినా ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. రేవంత్ రెడ్డికి పాలనా అనుభవం లేకపోయినా అనుభవజ్ఞులైన మంత్రుల సూచనలు తీసుకొని పాలన సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు.
BJP MLA Fires on Telangana Govt : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు తగ్గించుకుని పాలన సాగించాలని కోరుతున్నానని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం చేసే మంచి పనులకు సహకారం అందిస్తామని, హామీలను విస్మరిస్తే మాత్రం బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. హామీలను నెరవేర్చేందుకు ఎలాంటి కార్యాచరణ అమలు చేస్తారో శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు(Palamuru-Rangareddy Project)కు జాతీయ హోదా కోసం ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోతే ముందుకు తీసుకుపోరా అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.