BJP MLA Candidates Final List Telangana 2023 :తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తలపడనున్న అభ్యర్థుల తుది జాబితాను గురువారం విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఇప్పటికే రెండు విడతల్లో 53 స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మిగతా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక, మిత్రపక్షం జనసేనకు సీట్ల కేటాయింపుపై కసరత్తు చేస్తోంది.
Telangana Assembly Elections 2023 : ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాలవారీగా ఆశావహులు, వారి బలాబలాలు, సామాజిక సమీకరణాలపై ఓ నిర్ణయానికి వచ్చి నియోజకవర్గానికి రెండు, మూడు పేర్లతో ఒక జాబితాను రూపొందించారు. అయితే జనసేన 26 స్థానాలు కోరుతున్న విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దృష్టికి తీసుకెళ్లారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఈ క్రమంలో తెలంగాణలో ఆ పార్టీ బలం ఆధారంగా.. జనసేనకు 10 స్థానాల వరకు ఇవ్వాలని సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి వచ్చారు బీజేపీ నేతలు. ఈ నేపథ్యంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు ఈరోజు సాయంత్రం సమావేశమై అభ్యర్థులను ఖరారు చేయనుంది. గురువారం ఉదయం తుది జాబితాను విడుదల చేయనున్నారు.
పాత, కొత్తల కలయికగా :సుదీర్ఘ కసరత్తు అనంతరం పాత, కొత్తల కలయికగా బీజేపీ అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇతర పార్టీల నుంచి బుధవారం కొంతమంది నాయకులు చేరే అవకాశం ఉందని, వారిలో కొందరిని అభ్యర్థులుగా ఖరారు చేయవచ్చని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. జనసేన పార్టీ కోరుతున్న స్థానాలు జీహెచ్‌ఎంసీ, ఖమ్మం జిల్లాలో ఉన్నట్లు కమలం పార్టీ నేతలు తెలిపారు. ప్రధానంగా కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, మేడ్చల్, అశ్వారావుపేట, నాగర్‌కర్నూల్, ఖమ్మం, వైరా, కొత్తగూడెంతో పాటు మరో రెండు సెగ్మెంట్ల విషయంలో చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు.