BJP Leaders Meet Families in Telangana: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్దం చేసింది. ఈనెల 22న 'ఇంటింటికీ బీజేపీ' పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. తెలంగాణలో ఒక్కరోజే 35 లక్షల కుటుంబాలను కలిసేలా కార్యాచరణను రూపొందించింది. పోలింగ్ బూత్ అధ్యక్షుడి మొదలు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ వరకు ప్రతి ఒక్కరూ ఆ రోజున తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలను కలవనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంటింటికీ బీజేపీ పేరిట ప్రజలతో మమేకం కానున్నారు.
BJP meet 35 lakh Families in Telangana : రాష్ట్రంలో బీజేపీకి 35 వేల పోలింగ్ బూత్ కమిటీలున్నాయి. ప్రతి పోలింగ్ కమిటీ అధ్యక్షుడు తమ పోలింగ్ కేంద్రం పరిధిలో ఈనెల 22న వంద కుటుంబాలను కలిసి నరేంద్ర మోదీ పాలనలో జరిగిన అభివృద్ధిని వివరించి.. దీంతో పాటు ప్రజలకు కలిగిన మేలును వివరించనున్నారు. ఈ సందర్భంగా ప్రచురించిన కరపత్రాలను ఇంటింటికీ పంచనున్నారు. స్టిక్కర్లను అంటించనున్నారు.
Intintiki BJP in Telangana: బండి సంజయ్ ఆ రోజు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని చైతన్య పురి, విద్యానగర్ కాలనీల్లో పర్యటిస్తారు. స్వయంగా ఇంటింటికీ వెళ్లి మోదీ ప్రభుత్వ విజయాలు, ప్రజలకు జరిగిన మేలును వివరించడమే కాకుండా కరపత్రాలను అందజేస్తారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా రాష్ట్రానికి చెందిన జాతీయ నాయకులు, జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలంతా ఆ రోజు తమ నియోజకవర్గాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పర్యటించి ఒక్కొక్కరు వంద కుటుంబాలను కలుస్తారు. మహా జనసంపర్క్ యాత్రలో భాగంగా ఈనెల 22 నుంచి 30 వరకు 'ఇంటింటికీ బీజేపీ' పేరుతో బీజేపీ నాయకులు, కార్యకర్తలంతా తెలంగాణలోని ప్రతి కుటుంబాన్ని కలిసి నరేంద్ర మోదీ పాలనను వివరిస్తూ.. దానితో పాటు ప్రచురించిన కరపత్రాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.