కాంట్రాక్ట్ నర్సులను(nurse) తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని భాజపా మహిళా మోర్చా(BJP MAHILA MORCHA) డిమాండ్ చేసింది. నర్సులకు మద్దతుగా హైదరాబాద్‌లో ఆందోళనకు దిగింది. కోఠిలోని ప్రజా వైద్యారోగ్య సంచాలకుల(Director of Public Health) కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారులు స్పందించకపోవడంతో గేటు లోపలికి చొచ్చుకొని వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు జోక్యం చేసుకొని వారిని అడ్డుకున్నారు. మోర్చా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
'తొలగించడం దుర్మార్గం'
కొవిడ్ సేవల కోసం ఏడాది కింద నియామకం అయిన నర్సులను విధుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం(STATE GOVERNMENT) తొలగించడాన్ని భాజపా మహిళా మోర్చా నాయకులు ఖండించారు. కరోనా క్లిష్ట సమయంలో సేవలు అందించిన నర్సులను కొనసాగించాల్సిందిపోయి... తొలగించడం దుర్మార్గమని మండిపడ్డారు. నర్సులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని... లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.