BJP Mahila Morcha Deeksha in Hyderabad: తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. వివిధ పార్టీలు నియోజకవర్గాల వారీగా ఇప్పటికే వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. కొన్ని పార్టీలు పాదయాత్రలతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నంలో దూసుకెళ్తున్నాయి. ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపడుతూ ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇదిలా ఉంటే అధికార పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద దీక్షకు సిద్ధమయ్యారు.
తామేమి తక్కువ కాదంటూ బీజేపీ కవిత దీక్షకు పోటీగా హైదరాబాద్‌లో దీక్ష చేపట్టేందుకు సిద్ధమైంది. ఎమ్మెల్సీ కవిత దిల్లీలో మహిళా బిల్లు కోసం దీక్ష చేపడుతుండగా.. ఆమెకు ధీటుగా భాగ్యనగరంలో బీజేపీ మహిళా మోర్చా నేతలు రాష్ట్రంలోని బెల్టు షాపులు, మహిళలపై హత్యలు, అత్యాచారాలను నిరసిస్తూ దీక్ష చేయనున్నారు. ఈ నిరసన దీక్షలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, విజయశాంతితో పాటు పలువురు మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు దేశమంతా తెలియాలి: రాష్ట్రంలో మహిళలపై జరిగే అరాచకాలకు నిరసనగా చేపట్టే ఈ దీక్షలో మహిళా నేతలంతా పాల్గొనాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపునిచ్చారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగే దీక్షలో తెలంగాణలో జరుగుతున్న అరాచకాలు దేశమంతా తెలియాలని బండి సంజయ్ పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో మహిళా మోర్చా నేతలతో సమావేశమైన బండి సంజయ్... తెలంగాణ మహిళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. రాష్ట్రంలో మద్యం, బెల్ట్ షాపులతో మహిళలు ఎంతో ఇబ్బందిపడుతున్నారని వ్యాఖ్యానించారు. రేపటి దీక్షలో డీకే అరుణ, విజయశాంతి పాల్గొంటారని వివరించారు.