BJP LP Leader in Telangana : ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో 8 మంది బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈనెల 9న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా, కాషాయ నేతలు ప్రమాణ స్వీకారం చేయలేదు. ప్రొటెం స్పీకర్‌గా మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సమక్షంలో ప్రమాణం చేయబోమని ప్రకటించి గైర్హాజరయ్యారు. సీనియర్ ఎమ్మెల్యేలను కాదని అక్బరుద్దీన్ ఓవైసీని (Akbar Uddin Owaisi) ప్రొటెం స్పీకర్ చేయటంపై గవర్నర్ తమిళి సై సౌందర రాజన్‌కు సైతం ఫిర్యాదు చేశారు.
BJP MLAs Competing for Legislative Party Leader Post : తరువాత అసెంబ్లీ గేట్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. ఇవాళ సమావేశాలు ప్రారంభం కానుండటంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో ప్రమాణం చేయాలని వారు భావిస్తున్నారు. ఈసారి శాసనసభాపక్ష నేత లేకుండానే సమావేశాల్లో పాల్గొననున్నట్లు తెలిసింది. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి కేవలం రాజాసింగ్(MLA Raja Singh)ఒక్కరే గెలుపొందగా తర్వాత ఉపఎన్నికల్లో రఘునందన్‌రావు, ఈటల రాజేందర్ విజయం సాధించారు. కాగా ఎల్పీ నేతగా రాజాసింగ్‌కు పార్టీ అవకాశం ఇచ్చింది.
ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఉంటే నేను ప్రమాణస్వీకారం చేయను : రాజా సింగ్
నాయకుల మధ్య ఆధిపత్య పోరు :ఇటీవలి ఎన్నికల్లో కమలం పార్టీ 8 స్థానాల్లో గెలుపొందటంతో, ఎల్పీ నేత రేసులో రాజాసింగ్‌తో పాటు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నాయకుల మధ్య ఆధిపత్య పోరు కారణంగా, ఇప్పుడే శాసనసభాపక్ష నేతను నిర్ణయిస్తే నష్టపోయే ప్రమాదముందని హైకమాండ్ గ్రహించినట్లు సమాచారం. పార్లమెంట్ సమావేశాల తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.