BJP LP Leader in Telangana :రాష్ట్ర శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి చెందిన 8 మంది అభ్యర్థులు విజయం సాధించారు. అయితే ఈ నెల 9 నుంచి శాసనసభా సమావేశాలు ప్రారంభంకావడంతో ఎల్పీనేత లేకుండానే సమావేశాలకు హాజరయ్యారు. సభలో లేవనెత్తాల్సిన అంశాలపై గట్టిగా గళం విప్పేందుకు సమస్యలపై అవగాహన ఉన్న సీనియర్ ఎమ్మెల్యేను ఎల్పీనేతగా ఎంపిక చేయాల్సి ఉంటుంది.
BJP High Command Focus on State BJP LP Leader: తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగగా ఆ మూడు రాష్ర్టాల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపికలో నిమగ్నమైన జాతీయ నాయకత్వం తెలంగాణ ఎల్పీ నేత ఎంపికపై దృష్టి కేంద్రీకరించలేకపోయింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రుల ఎంపిక ప్రక్రియ ముగియడంతో తెలంగాణపై అధిష్ఠానం దృష్టి పెట్టింది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత శాసనసభపక్ష నేతను ప్రకటించనున్నట్లు సమాచారం.
Telangana BJP LP Leader :బీజేపీ శాసనసభాపక్ష నేత బరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా మూడు సార్లు విజయం సాధించిన రాజాసింగ్‌తో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కామారెడ్డి నుంచి గెలుపొందిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
లోక్‌సభ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు ఉండవు : కిషన్‌రెడ్డి
రాజాసింగ్‌కు గత శాసనసభలో ఎల్పీనేతగా పని చేసిన అనుభవం ఉంది. పార్టీకి విధేయుడిగా ఉండటం మూడు సార్లు వరుసగా విజయం సాధించడం రాజాసింగ్‌కు ఉన్న అనుకూలతలుగా చెప్పుకోవచ్చు. రాజాసింగ్‌ను ప్రతికూలతలు కూడా వెంటాడుతున్నాయి. తెలుగుభాషపై పట్టులేకపోవడం, హిందుత్వ ఎజెండా, గోషామహల్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితంకావడం గ్రామీణ స్థాయి సమస్యలపై అవగాహన లేకపోవడం వంటి అంశాలు ఇబ్బందిగా ఉన్నాయి.
BJP MLA Raja Singh in BJP LP Leader Post List :రాజాసింగ్‌కు ఎల్పీ నేతగా ఇవ్వని పక్షంలో కామారెడ్డి నుంచి విజయం సాధించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డికి అవకాశం కల్పించనున్నట్లు పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. వెంకటరమణారెడ్డి కామారెడ్డి నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, తాజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పోటీ చేసి విజయం సాధించారు. ఇద్దరు ఉద్దండులపై విజయం సాధించి రాష్ట్ర ప్రజలతో పాటు జాతీయ నాయకత్వం చూపు తనవైపునకు తిప్పుకున్నారు. ఇది కాటిపల్లికి కలిసి వచ్చే అవకాశం. గతంలో జడ్పీ ఛైర్మన్‌గా చేసిన అనుభవంతో పాటు మోదీపై తనుకున్న అభిమానం అంతా ఇంతా కాదు.