BJP Leaders Meet CP CV Anand: టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిపై తెరాస కార్యకర్తల దాడిపై ఆగ్రహం వ్యక్తంచేసిన భాజపా నాయకులు.. తెలంగాణ భవన్ ముట్టడికి వెళ్లేందుకు యత్నించారు. వారిని లోటస్‌పాండ్ వెళ్లే దారిలో.. పోలీసులు అడ్డుకున్నారు. అక్కడినుంచి సీపీ ఆనంద్‌తో మాట్లాడించారు.
అనంతరం భాజపా నేత చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ని కలిసేందుకు వెళ్లారు. ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని సీపీ సీవీ ఆనంద్ హామీ ఇచ్చారు. మరికొందరు బీజేవైఎం కార్యకర్తలను నాంపల్లి భాజపా కార్యాలయం వద్ద అరెస్ట్ చేసి అబిడ్స్‌కు తరలించారు. మరోవైపు తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
అసలేం జరిగింది:భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై తెరాస కార్యకర్తలు ఉదయం దాడి చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసాన్ని ముట్టడించి ఇంటిలోని అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఎంపీ ఇంటి ముట్టడికి వెళ్లిన తెరాస కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. ఇటీవల ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ కవిత పార్టీ మారతారని చెప్పడంతో పాటు ఆయన మరికొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెరాస కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో ఎంపీ అర్వింద్ హైదరాబాద్‌లో లేరు. నిజామాబాద్‌లో కలెక్టరేట్‌లో నిర్వహించిన దిశ సమావేశంలో ఆయన ఉన్నారు. హైదరాబాద్‌లో తెరాస కార్యకర్తల దాడి నేపథ్యంలో నిజామాబాద్‌లో ఎంపీ ఇంటి వద్ద పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి: