సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జులై 3న జరిగే మోదీ బహిరంగ సభకు 10 లక్షల కంటే ఎక్కువ జనాలు వచ్చేందుకు అవకాశం ఉందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సదుపాయాలు కల్పిస్తామని ఆమె స్పష్టం చేశారు. డీకే అరుణతో పాటు భాజపా నేతలు బండి సంజయ్ కుమార్, శివ ప్రకాశ్, అరవింద్ మీనన్, ఈటల రాజేందర్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాంచందర్‌రావు తదితరులు సికిందరాబాద్ పరేడ్ మైదానాన్ని సందర్శించి పరిశీలించారు. బహిరంగ సభ ఏర్పాట్లకు సంబంధించి సమీక్షించారు.
భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా జులై 3న భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు డీకే అరుణ తెలిపారు. ప్రధానితో సహా పెద్ద ఎత్తున ప్రముఖులు పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రతి బూత్ నుంచి 35- 40 మంది కార్యకర్తలు తరలివస్తారని డీకే అరుణ వివరించారు.