BJP Leaders Reaction on Republic Day Celebrations: గణతంత్ర వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రిపబ్లిక్ డే జరపాలని హైకోర్టు చెప్పిందంటేనే తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. అధికారంలో ఎవరున్నా కొన్ని నిబంధనలు పాటించాల్సిందేనన్న ఆయన.. రాజ్యాంగేతర శక్తులకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్‌కు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదని.. ఆయనది రాజ్యాంగ వ్యతిరేక వైఖరి అని మండిపడ్డారు. కేసీఆర్.. ఘర్షణాత్మక వైఖరి కోరుకుంటున్నారని అన్నారు.
ఈ మేరకు దిల్లీలో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ పనుల వల్ల తెలంగాణ పరువు పోతోందని దుయ్యబట్టారు. నిజాం కాలంనాటి ఆలోచనలతో రాష్ట్రాన్ని కేసీఆర్ పాడుచేస్తున్నారని ఆక్షేపించారు. ధర్నాచౌక్ వద్ద ధర్నాలు చేయవద్దని గతంలో కేసీఆర్ అన్నారని.. ధర్నా చేయాలంటే కోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితి తెచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవం జరపాలని ప్రజలు కోర్టుకు వెళ్లే పరిస్థితి తీసుకొచ్చారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కేసీఆర్‌కు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు. రిపబ్లిక్ డే వేడుకనూ రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. సీఎం కేసీఆర్‌ది.. రాజ్యాంగ వ్యతిరేక వైఖరి. కేసీఆర్ ఘర్షణాత్మక వైఖరి కోరుకుంటున్నారు. అంబేడ్కర్‌ను, రాజ్యాంగాన్ని కేసీఆర్ అవమానించారు. రాష్ట్రపతి, గవర్నర్‌నూ కేసీఆర్ అవమానిస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు దుర్మార్గపు ఆలోచనలు వస్తున్నాయి.-కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
వేడుకలకు రాజకీయాలు ఆపాదించడం దారుణం..: పరేడ్‌తో గణతంత్ర దినోత్సవ వేడుకలు చేయాలని హైకోర్టు చెప్పడాన్ని తాము స్వాగతిస్తున్నామని ఎంపీ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. కరోనా ఉందని సాకు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. హైకోర్టు తీర్పు కేసీఆర్ సర్కారుకు చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఇప్పటికైనా బేషజాలకు పోకుండా ఉండాలని.. ఆయనకు సద్బుద్ధి రావాలని కోరుతున్నానన్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా దేశం గర్వించదగ్గ వేడుకకు రాజకీయాలు ఆపాదించడం దారుణమని లక్ష్మణ్ మండిపడ్డారు. ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక విధానాలను చూసి ప్రజలు చీదరిస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ బాబాసాహెబ్ అంబేడ్కర్, రాజ్యాంగానికి వ్యతిరేకమని మరోసారి రుజువయ్యిందన్నారు. ప్రతీ సంప్రదాయం కోర్టు ద్వారానే కాపాడలంటే కష్టమని వ్యాఖ్యానించారు.
హైకోర్టు తీర్పు కేసీఆర్ సర్కారుకు చెంపపెట్టు లాంటిది. కేసీఆర్ ఇప్పటికైనా బేషజాలకు పోకుండా ఉండాలని ఆయనకు సద్బుద్ధి రావాలని కోరుతున్నా. కరోనా ఉందని సాకు చెప్పడం హాస్యాస్పదం. దేశం గర్వించదగ్గ వేడుకకు రాజకీయాలు ఆపాదించడం దారుణం. మీ రాజ్యాంగ వ్యతిరేక విధానాలను చూసి ప్రజలు ఛీదరిస్తున్నారు. మీరు అంబేడ్కర్, రాజ్యాంగానికి వ్యతిరేకమని మరోసారి రుజువు అయింది.-ఎంపీ లక్ష్మణ్