bjp leaders reaction on Girl falls in nala: శుక్లవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు సికింద్రాబాద్‌లో ఇవాళ ఉదయం పాల పాకెట్ కోసమని తమ్ముడుతో కలిసి షాప్‌కు వెళ్లిన మౌనిక అనే 11 ఏళ్ల చిన్నారి నాలాలో పడి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే.. ఈ ఘటనపై సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. ఇందులో జీహెచ్‌ఎంసీ లోపం స్పష్టంగా కనిపిస్తోందని వివిధ రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. తాజాగా ఈ ఘటనపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. చిన్నారి మౌనిక తవ్వేసిన రోడ్డు, మ్యాన్‌హోల్‌లో పడి కొట్టుకుపోయిందని కిషన్‌రెడ్డి అన్నారు.
"రాత్రికి రాత్రి రోడ్లను తవ్వేస్తున్నారు.పైప్ లైన్ వేయాలి కాబట్టి ఆపేస్తున్నామంటున్నారు. చిన్నారి మౌనిక వర్షం నీటిలో కొట్టుకుపోయింది. జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్లు రూ.5 నుంచి రూ.10 లక్షలు చేసిన పనికి డబ్బులు చెల్లించలేదని ధర్నా చేశారు. జీహెచ్‌ఎంసీ వేలకోట్లు అప్పులు తెచ్చినా కనీస సౌకర్యాలు మెరుగుపడటం లేదు"- కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి
గతంలో అంబర్పెట్లో కూడా ఒక మహిళ ఇదే విధంగా మృతి చెందిందని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. జీహెచ్‌ఎంసీ, ఆర్అండ్‌బీ మధ్య సమన్వయం లేకపోవడంతో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. పేదలు ఉండే సికింద్రాబాద్లాంటి ప్రాంతాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రంలో 80శాతం ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తోందని.. అయినా జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్ లేమితో ఉన్నాయన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ముందుగానే గుర్తించి.. ముందస్తు చర్యలు చేపట్టాలని కిషన్‌రెడ్డి సూచించారు.
ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. జీహెచ్‌ఎంసీ వైఫల్యం వల్లే సికింద్రాబాద్‌లో 10 ఏళ్ల చిన్నారి మౌనిక చనిపోయిందని బండి సంజయ్ ట్వీట్ చేశారు. మ్యాన్‌హోళ్లు, గుంతలు, వీధికుక్కల కారణంగా వరుస మరణాలకు బాధ్యత వహిస్తూ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని విమర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ఒపెన్ డ్రెయిన్లు, మ్యాన్‌హోల్‌లను సమీక్షించాలని డిమాండ్ చేశారు.
డ్రైనేజీ వ్యవస్థ మెరుగు లోపల మురుగు అన్నట్లుగా ఉంది: మరోవైపు ఇదే అంశంపై స్పందించిన బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్.. బీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థపైన మెరుగు లోపల మురుగు అన్నట్లుగా ఉందని ధ్వజమెత్తారు. వందల కోట్లతో నాలాల క్యాపింగ్ చేస్తామన్న హామీ ఉత్త మాటగానే మిగిలిపోయిందని దుయ్యబట్టారు.