BJP leaders on TRS పోలీసులు పూర్తిస్థాయిలో తెరాసకు తొత్తులుగా మారిపోయి బండి సంజయ్‌ను అరెస్టు చేశారని భాజపా రాజ్యసభ ఎంపీ కె.లక్ష్మణ్ మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే తెరాస సంజయ్ పాదయాత్రను అడ్డుకుందని ఆరోపించారు. హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో చేపట్టిన నిరసన దీక్షలో ఆయన మాట్లాడారు.
ప్రజా మద్దతు కోసం శాంతియుతంగా ఈరోజు నిరసనకు దిగినట్లు లక్ష్మణ్ స్పష్టం చేశారు. అవినీతి కుటుంబపాలనను విముక్తి చేసి తెలంగాణ తల్లిని బందీ నుంచి విడిపిస్తామన్నారు. కచ్చితంగా ఈ నెల 27న బహరంగ సభ నిర్వహిస్తామని తేల్చిచెప్పారు. రేపటి నుంచి ప్రజా సంగ్రామ యాత్ర యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
భాజపాకు పెరిగిన మద్దతును చూసి తెరాస ఓర్వలేకపోతోంది. దిల్లీలో జరిగిన లిక్కర్ కుంభకోణాన్ని ప్రజల దృష్టి నుంచి మళ్లించేందుకు యత్నిస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి కూతురు ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. అందుకే అకారణంగా బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకున్నారు. - కె.లక్ష్మణ్, రాజ్యసభ ఎంపీ
ఒక మహిళా లిక్కర్ స్కాంలో ఉందంటే రాష్ట్రం పరువు పోతుందని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యురాలు మాజీ ఎంపీ విజయశాంతి మండిపడ్డారు. ప్రజలు మార్పు కోరుతున్నారని.. అందుకే కేసీఆర్ కుటుంబాన్ని రాష్ట్రం నుంచి వెలివేయాలని చూస్తున్నారని తెలిపారు. బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ చేపట్టిన నిరసన దీక్షలో లక్ష్మణ్‌తో పాటు మాజీ ఎంపీలు విజయశాంతి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జీవిత రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ దీక్ష ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది.
మునుగోడు ఎన్నిక జరిగితే భాజపా గెలవడం ఖాయమని.. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి తీరుతుందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి స్పష్టం చేశారు. ప్రజా సంగ్రామ యాత్రకు ముందే డీజీపీకి లేఖ ఇచ్చామని.. ఈరోజు పోలీసు కమిషనర్ యాత్రకు పర్మిషన్ లేదని నోటిసులు ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు. బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ నాంపల్లి భాజపా కార్యాలయంలో చేపట్టిన నిరసన దీక్షలో ఇంద్రసేనా రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో అడుగడునా అవినీతి ఉందని.. డ్రగ్స్ కేసు, నయీం డైరీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఏదో రకంగా గెలవాలని భాజపాను ప్రజల్లోకి వెళ్లకుండా సీఎం కేసీఆర్ చేస్తున్నారని ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. ఎవరు అడ్డుకున్నా బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత కొనసాగుతుందని ఇంద్రసేనా రెడ్డి స్పష్టం చేశారు.
లిక్కర్ స్కామ్ దృష్టి మరల్చేందుకే పాదయాత్రను అడ్డుకున్నారన్న లక్ష్మణ్ ఇవీ చదవండి:కుంటిసాకులతో ప్రజాసంగ్రామ యాత్రను ఆపేందుకు కుట్ర జరుగుతోందన్న బండి సంజయ్
ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, ఇకపై UPSCలోనూ వన్ టైమ్ రిజిస్ట్రేషన్