BJP leaders protest: రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై భాజపా, తెరాసల మధ్య తీవ్ర దుమారం రేగుతుంది... తప్పు మీదంటే మీదంటూ ఒకరిపై ఒకరు నిప్పులు కక్కుతున్నారు. మునుగోడు ఉపఎన్నికలో తెరాస పార్టీ ఓటమి భయంతోనే ఈ విధమైన నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే చింతల రామచందర్ రెడ్డి విమర్శించారు. భాజపా హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడితో కలిసి బర్కత్పుర చమన్లో కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
వరంగల్‌లోని కాశిబుగ్గలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై భాజపా శ్రేణులు ఆందోళనకు దిగారు. తెరాస ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశాయి. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తెరాస ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం తమకు లేదని భాజపా శ్రేణులు స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలనలో అభివృద్ధి జరిగి ఉంటే ప్రజలే వారి పాలనకు పట్టం కడతారని గుర్తించాలని ఎద్దేవా చేశారు. ఓటమి భయంతో తెరాస నేతలు అన్ని విధాలుగా భాజపా గెలుపును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.