Tribute to Atal Bihari Vajpayee: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతి కార్యక్రమాన్ని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్, విజయశాంతి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, భాజపా శ్రేణులు హాజరై వాజ్‌పేయీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం భాజపా యువ మోర్ఛా ఆధ్వర్యంలో నిర్వహించిన సుపరిపాలన దినోత్సవ సదస్సులో పాల్గొన్నారు. వాజ్‌పేయి గొప్ప పరిపాలన దక్షడని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
మనం అందరం కూడా దేశ వ్యాప్తంగా అటల్ బిహారీ వాజపేయీ జన్మదిన వేడుకలను ఓ పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నాం. భవిష్యత్తు తరాలకు వాజ్‌పేయీ చరిత్ర తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధానమంత్రిగా పని చేసిన సమయంలో ప్రపంచంలోనే గొప్ప నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు భాజపా యువ మోర్ఛా జాతీయ అధ్యక్షుడిగా పని చేశాను. వాజ్‌పేయీకి అనేక సంవత్సరాల పాటు సేవ చేసే అదృష్టం నాకు కలిగింది.
వాజ్‌పేయీ గొప్ప పరిపాలన దక్షుడు. ఆయన ప్రసంగాలను వినేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చేవారు. నవ శకానికి వాజ్‌పేయీ నాంది పలికారు. సైనికులకు అండగా నిలిచి పాకిస్థాన్‌పై విజయానికి కృషి చేశారు. అద్భుతమైన జాతీయ రహదారులను అందించారు.
-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
వాజ్‌పేయీ జయంతిని కేంద్ర ప్రభుత్వం సుపరిపాలన దినోత్సవంగా జరుపుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వాజ్‌పేయీ ఆశయాలను నరేంద్ర మోదీ అమలు చేస్తున్నారని వెల్లడించారు.
పాకిస్థాన్‌ను దోషిగా నిలబెట్టింది ఆయనే..
పార్టీ సిద్దాంతానికి కట్టుబడి 65 సంవత్సరాలు వాజ్‌పేయీ పని చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. డబ్బులు లేకుండా పార్టీ సిద్దాంతం, కార్యకర్తల కృషితో ప్రధాని అయ్యారని తెలిపారు. ప్రపంచం ముందు పాకిస్థాన్‌ను దోషిగా నిలబెట్టింది వాజ్‌పేయీ అని గుర్తు చేశారు.
దేశాన్ని అనేక సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ నియంతృత్వంగా వ్యవహరించింది. వాజ్‌పేయీ ప్రధానిగా సుపరిపాలన అందించారు. పార్టీ సిద్దాంతానికి కట్టుబడి 65 సంవత్సరాలు పని చేశారు. డబ్బులు లేకుండా పార్టీ సిద్దాంతం, కార్యకర్తల కృషితో ప్రధాని అయ్యారు. వాజ్‌పేయీ ప్రపంచం ముందు పాకిస్థాన్‌ను దోషిగా నిలబెట్టారు.
ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించిన అదృష్టవంతుడు. దేశానికి అనేక సంస్కరణలు తీసుకువచ్చిన ఆయనను గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. వాజ్‌పేయీ సంస్కరణలు, ఆలోచన విధానాన్ని మోదీ అమలు చేస్తున్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలు మున్నావర్ ఫారుఖీని నిషేధిస్తే.. కేటీఆర్ ఆహ్వానించారు. దుర్గమ్మ, రాముడు, సీతను విమర్శించే వ్యక్తులను సమావేశాలను పెట్టుకునేందుకు ఆహ్వానిస్తారా?
-భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
కేటీఆర్ ఒక నాస్తికుడని బండి సంజయ్ ఆరోపించారు. అందుకే మున్నావర్ ఫారూఖీని ఆహ్వానించారన్నారు. దుర్గమ్మ, రాముడు, సీతను విమర్శించే వ్యక్తులను సమావేశాలను పెట్టుకునేందుకు ఆహ్వానిస్తారా అంటూ ప్రశ్నించారు. భాజపా యువ మోర్ఛా కార్యకర్తలు మున్నావర్ ఫారుఖీని అడ్డుకోవాలని సూచించారు. వాజ్‌పేయ్ కలలను సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బండి తెలిపారు.
ఇదీ చూడండి:Minister Harish Rao: 'త్వరలోనే సిద్దిపేటను సీడ్ హబ్‌గా మారుస్తాం'