రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఎంతో సమయం లేదని..సన్నద్ధం కావాలని పార్టీ ముఖ్య నేతలకు భాజపా సహ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత వ్యవహారాలు) శివప్రకాశ్ పిలుపునిచ్చారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి చెందిన పార్టీ జాతీయ నేతలు, రాష్ట్ర పదాధికారులతో పార్టీ కార్యాలయంలో శివప్రకాశ్ ఆదివారం వేర్వేరుగా సమావేశమయ్యారు. బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన ముఖ్యనేతల సమావేశంలో కిషన్‌రెడ్డి, డీకే అరుణ, కె.లక్ష్మణ్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఈటల రాజేందర్, జితేందర్‌రెడ్డి, విజయశాంతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివప్రకాశ్ మాట్లాడుతూ.. ఇది ఎన్నికల సంవత్సరం అని, నేతలు అంతా బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. పార్టీని సంస్థాగతంగా పటిష్ఠం చేస్తూనే, ఇతర పార్టీల నుంచి చేరికలు జరిగేలా చూడాలన్నారు. అనంతరం పార్టీ రాష్ట్ర పదాధికారులతోనూ సమావేశం అయ్యారు. ఇటీవలి వరకు వరుస ఎన్నికలు జరిగాయని.. ఇక రాష్ట్ర స్థాయిలో పార్టీపై పూర్తిస్థాయి దృష్టి పెట్టి సంస్థాగతంగా బలోపేతమవుదామని సూచించారు. ఇటీవల ప్రత్యేక సమావేశాలు పెట్టుకున్న అసంతృప్త నేతలు.. శివప్రకాశ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు.. పదవులు రాలేదని అనుకోవద్దని, పార్టీ కోసం పని చేస్తూ వెళుతుంటే అవకాశాలు అవే వస్తాయని నాయకులతో అన్నట్లు సమాచారం.
తెలంగాణలో సుపరిపాలన అవసరం
తెలంగాణకు కేంద్రంలో మోదీ అందిస్తున్న తరహాలో సుపరిపాలన అవసరమని, కేసీఆర్ సర్కార్ అణచివేత చర్యలకు బెదిరేదని లేదని తరుణ్‌చుగ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని భాజపా వదిలిపెట్టబోదని హెచ్చరించారు. యువ తెలంగాణ పార్టీని భాజపాలో విలీనం చేసిన జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణి రుద్రమ తమ కార్యకర్తలతో కలిసి గన్‌పార్క్ నుంచి ర్యాలీగా భాజపా రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి నిర్వహించిన సభకు తరుణ్‌చుగ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
మజ్లిస్‌కు సీఎం భయపడుతున్నారు