BJP Leaders Comments on CM KCR :రాష్ట్రంలోబీజేపీ మొదటిసారి బీసీ అభ్యర్థిని సీఎంగా ప్రకటించిందని ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్(MP Laxman) అన్నారు. బీజేపీని గెలిపిస్తే బీసీ అభ్యర్థి మొదటి సీఎం అవుతారని స్పష్టం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కారుకు ప్రజలు అవకాశం ఇవ్వాలని కోరారు. అలాగే రాష్ట్రంలో కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ఆ పార్టీ అధినాయకత్వం ప్రకటించడంతో నేతలు, కార్యకర్తలు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సంబురాల్లో ఎంపీ లక్ష్మణ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, తదితర ఓబీసీ మోర్చా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడారు. అవినీతి రహిత పాలన కోసం బీజేపీకి పట్టం కట్టాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను దగా చేసిందని మండిపడ్డారు. ఎస్సీని సీఎం చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందన్న లక్ష్మణ్.. ఆ రెండు పార్టీలు కూడా బీసీలను మోసం చేశాయన్నారు.
Etela Fires on KCR Family :బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత వరకు కల్వకుంట్ల కుటుంబంలోని వ్యక్తే సీఎం అవుతారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్.. కుటుంబ పార్టీగా ఉందన్నారు. బీఆర్ఎస్ పాలనలో.. ఇతర వర్గానికి చెందిన వ్యక్తి సీఎం కాబోరనేది వాస్తవమని వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్ష పదవిలోనూ కల్వకుంట్ల కుటుంబ సభ్యులే ఉంటారని.. ఇతర రాష్ట్రాల బీఆర్ఎస్ ఇన్‌ఛార్జ్‌లు వారి కుటుంబ సభ్యులే ఉంటారని చెప్పారు. ఇతర వర్గం, ఇతర కుటుంబసభ్యులకు అవకాశం ఇవ్వరని ఫైర్ అయ్యారు.