BJP Leaders Fires on KCR: భాజపాను బలహీనపరిచే కుట్ర జరుగుతోందని ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ దిల్లీలో ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ.. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ.. దిల్లీలోని తెలంగాణ భవన్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహానికి భాజపా నేతలు పాలాభిషేకం చేశారు. అంబేడ్కర్‌ను స్ఫూర్తిగా పాలన చేస్తున్నది భాజపా అని బండి సంజయ్ పేర్కొన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ రేపు పార్టీ కార్యాలయాల్లో దీక్షలు చేస్తామని వెల్లడించారు.
వచ్చే ఎన్నికల్లో తెరాస గెలిచేది 9 సీట్లు మాత్రమే
రాజ్యాంగం మారుస్తామని భాజపా ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెరాస గెలిచేది 9 సీట్లు మాత్రమేనని జోస్యం చెప్పారు. జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతోనే కేసీఆర్ విచిత్రంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మరోసారి సెంటిమెంట్ రెచ్చగొట్టి లబ్ది పొందాలనేది కేసీఆర్ ఆలోచన అని అభిప్రాయపడ్డారు. తెలంగాణకు అన్యాయం జరిగితే మోదీని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.
తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునే దుస్థితి నెలకొంది. రాజ్యాంగాన్ని ముట్టుకుని చూడు.. నీకు రాజ్యాంగం వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటీ? ప్రపంచమంతా భారత రాజ్యాంగాన్ని చూసి ప్రశంసిస్తోంది. బడ్జెట్‌పై అభ్యంతరాలు చెప్పండి... ఇబ్బందేమి లేదు.. కానీ బూతులు మాట్లాడటం సిగ్గు చేటు. దళితులంటే.. ఎందుకంత చులకన. ఎందుకు అంబేడ్కర్ జయంతి, వర్ధంతిలకు హాజరు కావు... కేసీఆర్‌కు దళితులపై ద్వేషం ఉంది.
- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
Etela fires on cm kcr comments:
కల్వకుంట్ల రాజ్యాంగం కావాలని కేసీఆర్ ఆరాటపడుతున్నారు: ఈటల
మరోవైపు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలంటూ అంబేడ్కర్‌ను అవమానించారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. రాజ్యాంగం దోపిడి పక్షపాతంకు వ్యతిరేకంగా సమానతను పంచిందని ఈటల అన్నారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఈటల గుర్తు చేశారు. ఎవరి లాగులు పగలకొడతావని ఘాటుగా ప్రశ్నించారు. తెలంగాణలో అనేక మంది ఐఏఎస్ అధికారులు కేసీఆర్ పాలనను భరించలేక రాజీనామా చేశారని తెలిపారు. కల్వకుంట్ల రాజ్యాంగం కావాలని కేసీఆర్ ఆరాటపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు, రాచరిక పరిపాలన కావాలని కేసీఆర్ కోరుకుంటున్నారని తెలిపారు. నిర్మలాసీతారామన్ గొప్ప బడ్జెట్‌ను ప్రవేశపెడితే కేసీఆర్ వ్యతిరేకించారని.. ఆయన వ్యాఖ్యలను చూసి గ్రామాల్లోని మహిళలు టీవీలు బంద్ చేసుకున్నారని తెలిపారు.