BJP Leaders Election Campaign Impact Telangana : గోల్కొండ ఖిల్లాపై కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇప్పుడు పోలింగ్‌కు సమయం దగ్గర పడటంతో ప్రచారాన్ని మరింత వేగవంతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలు, సమావేశాలు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఆ పార్టీ నాయకులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, అనురాగ్ సింగ్ ఠాకూర్, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి అదిత్యనాత్, ప్రమోద్ సావంత్, హిమంత బిశ్వ శర్మతో పాటు పలువురు జాతీయ నాయకులు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లలను ఆకట్టుకున్నారు. అగ్ర నేతల ప్రచారంతో నిస్తేజంలో ఉన్న కాషాయ పార్టీ గ్రాఫ్ కాస్త మెరుగు పడినట్లు తెలుస్తోంది.
PM Modi Campaign Impact in Telangana : తెలంగాణ అభివృద్ధి చెందాలంటే.. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలనే నినాదంతో బీజేపీ ముందుకు సాగుతోంది. నరేంద్ర మోదీ సంక్షేమ పథకాలు, దేశాభివృద్ధి, తెలంగాణకు కేటాయించిన నిధులు, బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను అగ్ర నాయకత్వం, పార్టీ అభ్యర్థులు క్షేత్రస్థాయిలో ఎండగడుతున్నారు. పార్టీ సాంప్రదాయ ఓటు బ్యాంకుతో పాటు వివిధ సామాజిక వర్గాలను ఆకట్టుకునేలా వ్యూహాలు అమలు చేస్తోంది. బీసీ ముఖ్యమంత్రి నినాదంతో కమలం పార్టీ ఎన్నికలను ఎదుర్కొంటోంది.
బీఆర్ఎస్ మునిగే నావ అని కేసీఆర్‌కు అర్థమైంది - తెలంగాణలో మార్పు తథ్యం : నరేంద్ర మోదీ
BJP Winning Chance in Telangana: బీసీల రాజ్యాధికారం, ఆత్మగౌరవం, ఎస్సీ వర్గీకరణను ప్రధాన ఎజెండాగా బీజేపీ తీసుకుంది. మోదీ గ్యారంటీ - బీజేపీ భరోసా పేరిట మేనిఫెస్టోలో హామీలను పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 119 స్థానాలు ఉండగా బీజేపీ 111 సీట్లలో పోటీ చేస్తోంది. పొత్తులో భాగంగా జనసేనకు 8సీట్లు కేటాయించింది. గత ఎన్నికల్లో గోషామహల్లో మాత్రమే విజయం సాధించింది. 105 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. ఈసారి మాత్రం గట్టి పోటీని ఇస్తోందని పార్టీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా 28 స్థానాల్లో ప్రభావాన్ని చూపనుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ ప్రభావం ఎవరిపైన చూపుతుందనే భయం ప్రత్యర్థి పార్టీ అభ్యర్ధులకు పట్టుకుంది.