Bandi sanjay comments on KCR: ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న అభివృద్దిని బీఆర్‌ఎస్ నేతలు కళ్లు ఉండి చూడలేని కబోదులని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేని అసమర్థ ప్రభుత్వం తెలంగాణ సర్కార్ అని ధ్వజమెత్తారు. ఈనెల 8న ప్రధాని రాక సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లతో కలిసి లక్ష్మణ్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునర్ నిర్మాణ పనులను పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం సహకరించకపోవడం వల్లనే కేంద్ర ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైల్వేశాఖ రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించిందన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రధాని మోదీ కృషి చేస్తున్నారన్నారు.
రాజ్యాంగంలో చదువులకు పదవులకు సంబంధం లేదు : తెలుగు రాష్ట్రాలకు రెండో వందేభారత్ రైలును ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రూ.715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రూపు రేఖలు మారనున్నాయన్నారు. ఈ నెల 8న పలు జాతీయ రహదారులకు మోదీ శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్‌పై విమర్శలు వర్షం కురిపించారు. ప్రధాని మోదీ తన డిగ్రీ సర్టిఫికేట్లు చూపించాలని దిల్లీ సీఎం కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై ఆయన స్పందించారు. రాజ్యాంగంలో చదువులకు పదవులకు సంబంధం లేదన్నారు. మోదీని విమర్శించే వారంతా చదువుకున్న అజ్ఞానులని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఎమ్మెస్సీ పొలిటికల్ సైన్స్ సర్టిఫికేట్లను బయటపెట్టాలని ధ్వజమెత్తారు.