Bandisanjay countered Komatireddy comments: తెలంగాణలో రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని.. హంగ్ వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ అంతర్గత విషయమని పేర్కొన్న ఆయన.. వాళ్ల పార్టీ మనిషిని వాళ్లే నమ్మడం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎన్నికల తర్వాత ఏ విధంగా కలిసిపోతారో కోమటిరెడ్డి రెడ్డి స్పష్టంగా చెప్పాలని ఆయన పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని పేర్కొన్న ఆయన.. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై ఆ పార్టీ ఇంకా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ప్రకటనకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇప్పటి వరకు కాంగ్రెస్ కనీసం సస్పెండ్ చేయడం లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు అనేక సందర్భల్లో కలిసి పనిచేశాయని గుర్తు గుర్తు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గిరిజన మహిళను ఓడించడానికి కలిసి పనిచేశారని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో కలిసి ఆందోళనకు దిగారని.. అసెంబ్లీలో కేసీఆర్ పదే పదే కాంగ్రెస్‌ను కొనియాడారని బండి సంజయ్ పేర్కొన్నారు.
"కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎన్నికల తర్వాత ఏ విధంగా కలిసిపోతారో కోమటిరెడ్డి రెడ్డి స్పష్టంగా చెప్పాలి. వరంగల్‌లో రాహుల్ గాంధీ ఏం అన్నారు. కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్‌తో పొత్తులు పెట్టుకుంటామని ఎవరైనా వ్యాఖ్యానించిన వారిని పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేస్తామన్నారు. మరి కోమటిరెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. బీజేపీని ఒంటరిగా ఎదుర్కొలేకా.. కాంగ్రెస్, ఎంఐఎం, వామపక్షాలు, బీఆర్‌ఎస్ అన్ని కలిసి వస్తున్నాయి".- బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
Muralidhar Rao counter on Komati Reddy comments: 'తొందరపడి ఓ కోయిలా ముందే కూసినట్లు' కోమటిరెడ్డి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పొత్తుపై ముందే మాట్లాడారని బీజేపీ మధ్యప్రదేశ్ ఇంచార్జ్ మురళీధర్ రావు అన్నారు. పార్టీ నుంచే తీసివేయడానికే కోమటిరెడ్డి అలా మాట్లాడి ఉండవచ్చునని అభిప్రాయం వ్యక్తం చేసిన ఆయన.. ఎంత మంది బీజేపీలో చేరినా కాంగ్రెస్ లాగా తమ పార్టీలో ఉండదని వ్యాఖ్యానించారు. ఏదో ఒకరకంగా చేరిన వారికి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు చెప్పారు.
పాత క్యాడర్ ఎక్కడ ఇబ్బంది పడటం లేదన్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. భారత ప్రజలకు వ్యతిరేకంగా బీబీసీ ప్రసారాలు చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. రాహుల్ గాంధీ ఏది మాట్లాడినా బూమరాంగ్ అవుతోందన్నారు. కర్ణాటకలో వచ్చే ఎన్నికలు బీజేపీకి సవాలేనన్నారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో బలంగా ఉందని పేర్కొన్న ఆయన.. క్యాష్ ఆర్గనైజేషన్ ఓరియెంటెడ్ స్టేట్‌గా కర్ణాటకను అభివర్ణించారు.