బండి సంజయ్ అరెస్ట్‌ను నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణుల నిరసనలు BJP Leaders protesting on Bandi Sanjay Arrest: రాష్ట్రవ్యాప్తంగా బండి సంజయ్ అరెస్ట్‌పై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. పదో తరగతి హిందీ పేపర్ వాట్సప్‌లో వైరల్ కావడాన్ని బండి సంజయ్‌కు ఆపాదిస్తూ నిర్బంధించడంపై వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశాయి. ఆయన ఎక్కడున్నారో వాకబు చేసేందుకు బొమ్మలరామారం వెళ్లిన ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కార్యకర్తలతో కలిసి స్టేషన్ లోపలికి వెళ్లేందుకు యత్నించగా రఘనందన్ రావును పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు, రఘునందన్ రావుకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. వాహనంలో ఆయనను తరలిస్తుండగా... కార్యకర్తలు అడ్డుకోవడం కాసేపు ఉద్రిక్తతకు కారణమైంది. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలు చేయట్లేదని రఘునందన్ మండిపడ్డారు.
అక్రమాలపై ప్రశ్నించే వారిని పోలీసులతో బలంవతంగా అరెస్టు చేయిస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. నిర్బంధించినంత మాత్రాన ప్రజల పక్షాన పోరాటం ఆపేదిలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంటినుంచి బయటకు రాగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్తున్న తనని ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ పోలీసులతో ఈటల వాగ్వాదానికి దిగారు. ప్రశ్నాపత్రాల లీకు సమస్యను పక్కదారి పట్టించేందుకే బండి సంజయ్ అరెస్ట్ డ్రామాను రసవత్తరంగా నడిపిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆందోళన: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ నేతలు పలు చోట్ల ఆందోళన నిర్వహించారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, పెద్దపల్లి, పాలకుర్తి, రామగిరిలో పలువురు పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లో సంజయ్ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆందోళనలు చేపట్టారు. భద్రాద్రి జిల్లా ఇల్లందులో బీజేపీ నాయకులను ముందస్తుగా అదుపులో తీసుకున్నారు.
మంచిర్యాల జిల్లా ఆదిలిపేట్ వద్ద బీజేపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ళ, భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో రాస్తారోకో నిర్వహించారు. నిర్మల్ జిల్లా భైంసాలో నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. నిర్మల్‌లో కమలం కార్యకర్తలు నిరసనలతో హోరెత్తించారు.
నిజామాబాద్, బాన్సువాడ, మంచిర్యాల మెదక్ జిల్లా నర్సాపూర్, నారాయణపేట, మక్తల్‌లో రాస్తారోకో నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. హనుమకొండ పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నాకు దిగిన వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీధర్, పార్టీ అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ జిల్లా వర్దన్నపేటలో ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. సూర్యాపేట జిల్లా తిర్మలగిరి చౌరస్తాలో కమలం శ్రేణులు రాస్తారోకో చేశారు.
ఇవీ చదవండి: