BJP leader vivek venkataswamy comments on MLC kavitha: దేశంలోనే అతిపెద్ద డిపాజిట్లు కలిగిన రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ అవతరించిందని, తెలంగాణ రాష్ట్ర ఖజానాను దోచుకొని కేసీఆర్ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన కుటుంబ సమేతంగా తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో.. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌పైన ఉన్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు బీఆర్ఎస్ పార్టీ స్థాపించారన్నారు. తెలంగాణలో సంపాదించిన సొమ్మును ఇతర రాష్ట్రాల్లో కేసీఆర్ ఖర్చు చేస్తున్నారన్నారు. దిల్లీ మద్యం కుంభకోణంలో జైలుకు వెళ్లిన మనీష్ సిసొదియా తరహాలోనే కవిత కూడా జైలుకు వెళ్తారని ఆయన తెలిపారు. కేసీఆర్ అధికారంలోకి వస్తే రైతును రాజును చేస్తానని చెప్పి కాంట్రాక్టర్లను కోటీశ్వరులను చేశాడన్నారు.
"తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణలోనే ఖతం అయితది. తెలంగాణలో కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకతను దారి మళ్లించడానికే బీఆర్ఎస్గా పేరు మార్చి కేంద్రంలో తిరుగుతున్నారు. తెలంగాణలో సంపాదించిన అవినీతి సొమ్మునంతా తీసుకెళ్లి ఇతర రాష్ట్రాలలో ఖర్చు పెడుతున్నాడు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడినప్పుడు నిధులే లేవు కానీ నేడు దేశంలో అత్యధికంగా డిపాజిట్లు ఉన్న పార్టీగా బీఆర్ఎస్ ఉంది. ఈ నిధులన్ని ఎక్కడి నుంచి వచ్చాయి. ఈ డబ్బంతా ప్రజలనుంచి దోచుకున్నారు. నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టి విమానాన్నే కొన్నారు. బీజేపీ పార్టీ నిర్వహిస్తున్న స్ట్రీట్ మీటింగ్‌లలో ప్రజలు కేసీఆర్‌పై వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ అధికారంలోకి వస్తే రైతును రాజును చేస్తానని చెప్పి నేడు కాంట్రాక్టర్లను కోటీశ్వరులను చేశాడు. దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా మద్యం కుంభకోణంలో జైలుకు వెళ్లినట్లు త్వరలోనే తెలంగాణ ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్తారు." - వివేక్ వెంకటస్వామి బీజేపీ నేత
ఇదీ దిల్లీ మద్యం కుంభకోణం కేసు..
delhi liqour scam: దిల్లీలో 2022 నవంబరులో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఎక్సైజ్ విధానంలో అనేక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. మద్యం విధానంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని, విధానపరమైన లోపాలున్నట్లు దిల్లీ ప్రధాన కార్యదర్శి నివేదిక ఇచ్చారు. మద్యం టెండర్ల విధానంలో కొందరికి లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నట్లు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. దీంతో ఈ ఉల్లంఘనలపై దర్యాప్తు చేపట్టాలని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. సీబీఐకి లేఖ రాశారు. ఈ నూతన ఎక్సైజ్ విధానంలో ఎక్సైజ్ శాఖకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మనీశ్ సిసోదియాను నిన్న సీబీఐ అరెస్ట్ చేయగా.. ఇవాళ కోర్టు 5రోజుల కస్టడీకి పంపింది.
శ్రీవారి దర్శించుకున్న అనంతరం మీడియాతో వివేక్ వెంకటస్వామి ఇవీ చదవండి: