హిందూ ధర్మానికి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ వెళ్తున్నారని భాజపా నేత విజయశాంతి దుయ్యబట్టారు. హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్లో ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆమె తెరాస పాలనపై విరుచుకుపడ్డారు. రాముడికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి సమయం లేదు కానీ.. మసీద్లకు మాత్రం వెళ్తున్నారన్నారు. రాష్ట్రంలో ఔరంగజేబు పాలన నడుస్తోందని ఆరోపించిన ఆమె.. ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంది ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకోసమేనా...? అని ప్రశ్నించారు.
తెరాస రాక్షస పాలనతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎమ్మెల్యేలతో రాముడిని హేళన చేసేలా మాట్లాడిస్తున్నారంటూ మండిపడ్డారు. అయోధ్యలో రాముడి గుడికి డబ్బులు ఎందుకు ఇవ్వాలని అంటూ... ఎంఐఎంతో మాత్రం స్నేహం చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు.