రాష్ట్రంలో ఆక్సిజన్, ఆస్పత్రుల్లో పడకల కొరత లేదని మంత్రి ఈటల రాజేందర్ చెప్పడం వల్ల ప్రజలు అసహ్యించుకుంటున్నారని భాజపా నేత విజయశాంతి ఆరోపించారు. కొవిడ్‌ను ఎదుర్కోవడంలో తెరాస సర్కారు వైఫల్యాలను ఎండగట్టారు. కేంద్రం అందిస్తోన్న చేయూతను పత్రికా ప్రకటనలో కొనియాడారు. పీఎం కేర్ నుంచి 5 ఆక్సిజన్ ప్లాంట్లను కేంద్రం ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇంకా 12 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడానికి నిధులు ఇచ్చి, యుద్ధ విమానాలను రాష్ట్రానికి పంపించిందని పేర్కొన్నారు.
కేంద్రం వల్లే రెమ్‌డెసివిర్
కేంద్ర ప్రభుత్వం స్పందించడం వల్లే రాష్ట్రంలో కరోనా బాధితులకు రెమ్‌డెసివిర్ అందుతోందని విజయశాంతి గుర్తు చేశారు. ప్రజా సంక్షేమాన్ని, ఆరోగ్యాన్ని తెరాస గాలికొదిలేస్తోందని విమర్శించారు. ఇప్పటివరకు ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం సమీక్షించిన దాఖలాలు లేవని విజయశాంతి అన్నారు. ఏడాది నుంచి ఒక్క ఆస్పత్రి నిర్మించలేదని ఆరోపించారు. వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.