Tarun Chug on Jubilee hills gang rape case: జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పోలీసులు అవకతవకలు చేశారని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్‌చుగ్ ఆరోపించారు. దోషులను రక్షించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అత్యాచారం జరిగిన వాహనం ప్రభుత్వానిదేనని గుర్తించడానికి ఎందుకు ఆలస్యమైందని తరుణ్ చుగ్ ప్రశ్నించారు. కేసీఆర్ ఎలా చెబితే పోలీసులు అలానే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కొంతమంది పోలీసులు కేసీఆర్ కుటుంబం కోసమే పనిచేస్తున్నారని తరుణ్ చుగ్ విమర్శించారు. పోలీసులు కేసీఆర్ కుటుంబం కోసం పనిచేయడం మానేసి ప్రజల కోసం పనిచేయాలని హితవు పలికారు. జూబ్లీహిల్స్ కేసులో న్యాయం జరిగేంతవరకు బాధితుల పక్షాన భాజపా పోరాడుతుందని స్పష్టం చేశారు. నిందితులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు... ఐదుగురు మైనర్ నిందితులను విచారణ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డును కోరనున్నారు. ఈ మేరకు 2015లో జువైనల్ జస్టిస్ యాక్ట్‌కు చేసిన చట్ట సవరణను పోలీసులు ఉదహరిస్తున్నారు. తీవ్ర నేరం చేసే మైనర్లను చట్ట ప్రకారం మేజర్‌గా పరిగణించవచ్చని చెబుతున్నారు. పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మంత్రి కేటీఆర్ స్పందించారు. పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయానికి తాను మద్దతు పలుకుతున్నట్లు ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు. 'అత్యాచారం నేరానికి పాల్పడేంత పెద్దవారైతే.. ఆ వ్యక్తిని కూడా పెద్దవారిగానే శిక్షించాలి.. మైనర్లుగా కాదు' అని ట్విటర్లో పోస్ట్ చేశారు.
ఇవీ చదవండి:Jubileehills rape case: పోలీసుల కీలక నిర్ణయం.. కేటీఆర్ మద్దతు