Konda visweswar reddy: క్లౌడ్ బరస్ట్ వల్ల రోజంతా వర్షం పడదని.. కేవలం కొన్ని గంటలు మాత్రమే కురుస్తుందని భాజపా నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. క్లౌడ్ బరస్ట్ ఎక్కడ పడితే పడదని.. అది కేవలం కొంత ప్రాంతానికే పరిమితమని వెల్లడించారు. వరదలపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. క్లౌడ్ బరస్ట్‌పై ఏ దేశం కుట్ర ఉందో సీఎ కేసీఆర్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో క్లౌడ్ బరస్ట్ అంశంపై ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. సీఎం క్లౌడ్ బరస్ట్ అంటున్నారు.. ఇంతకీ అది ఎలా జరిగింది..? అందలో ఏ దేశం కుట్ర ఉందన్న సమగ్ర వివరాలు వెల్లడించాలని కోరారు. క్లౌడ్ బరస్ట్ మీద సీఎం కేసీఆర్ మరింత స్పష్టత, సమాచారంతో మాట్లాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. క్లౌడ్ బరస్ట్, క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటో అర్థం చేసుకుని మాట్లాడాలన్నారు.
సీఎం కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ అంటున్నారు.. ఇంతకీ అది ఎలా జరిగింది...? అందులో విదేశీ కుట్ర అంటున్నారు..? ఏ దేశం వాళ్లు చేశారు...? చైనా, పాకిస్తాన్ దేశం కుట్ర పన్నిందా ..? అనేది స్పష్టం చేయాలి. క్లౌడ్ బరస్ట్ ఎక్కడ పడితే అక్కడ కాదు. క్లౌడ్ బరస్ట్ వల్ల వర్షం రోజంతా పడదు... కొన్ని గంటలే కురుస్తుంది. క్లౌడ్ బరస్ట్ కొంత ప్రాంతానికే పరిమితం. కాళేశ్వరం ప్రాజెక్టుతో వరదను నివారించవచ్చన్నారు. వరదలతోనే కాళేశ్వరం పంప్‌హౌస్ మునిగిపోయింది. కాళేశ్వరం ఆకృతి తప్పు.. రిజర్వాయర్లు కట్టలేదు. - కొండా విశ్వేశ్వర్ రెడ్డి, భాజపా నేత