BJP Leader Kishan Reddy Chit Chat : ఫిబ్రవరి 28 లేదా మార్చి మొదటి వారంలో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చునని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) తెలిపారు. తెలంగాణకు సంబంధించి 50 శాతం ఎంపీ అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని వెల్లడించారు. ఈ నెల 7, 8 తేదీల్లో పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశానికి జాతీయ స్థాయి నేతలు బన్సల్, అరవింద్ మీనన్, తరుణ్ చుగ్, ఇతర సీనియర్ నేతలు వస్తున్నారని వివరించారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన పర్యటనలు కార్యక్రమాలతో పాటు ఇతర కమిటీలు వేస్తామన్నారు.
'మేడిగడ్డ ఘటనతో రాష్ట్ర ఇమేజ్ గోదాట్లో కలిసింది - ఆ ప్రాజెక్టులపై సీబీఐ విచారణ కోరాలి'
Kishan Reddy on MLC Elections in Telangana : హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో కిషన్‌రెడ్డి ఇష్టాగోష్టి(Kishan Reddy Chit Chat)గా మాట్లాడారు. త్వరలోనే బీజేఎల్పీ నేత ఎన్నిక ఉంటుందని, ఈ ఎన్నిక కోసం పరిశీలకుడు వస్తారని తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పల్లా రాజీనామాతో ఆ స్థానం ఖాళీగా ఉందన్నారు. ఆ స్థానంలో తమ పార్టీ నేత ప్రకాష్ రెడ్డి టికెట్ ఆశించవచ్చునని అందులో తప్పేమి లేదన్నారు. త్వరలోనే ఎమ్మెల్సీ అభ్యర్థి అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్దంగా ఉన్నామని తెలిపారు.
"సుమారు 500 సంవత్సరాల పోరాట ఫలితం తరవాత అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించుకున్నాం. ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. 15 రోజుల పాటు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నాం. ప్రాణ ప్రతిష్ఠను తిలకించేందుకు ప్రత్యేకంగా ప్రత్యక్ష ప్రసారాన్ని అందించేలా ప్రణాళికలు చేస్తున్నాం."- కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు