'కలిసి పనిచేద్దాం'...భాజపా-జనసేన ఉమ్మడి ప్రకటన ఏపీ ప్రభుత్వ వైఖరివల్ల ఆ రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని, అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని భాజపా, జనసేన సంయుక్త ప్రకటనల్లో అభిప్రాయపడ్డాయి. విజయవాడలో జరిగిన సమావేశం అనంతరం ఈ రెండు పార్టీల అధ్యక్షులు ఉమ్మడి ప్రకటన చేశారు. రాష్ట్రం, దేశంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించాక రెండు పార్టీలు కలిసినడుద్దామని నిర్ణయించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
వైకాపా కక్షసాధింపు చర్యలు
ప్రధాని మోదీ అందిస్తున్న అవినీతి రహిత, సమర్థవంతమైన పాలనను స్వాగతిస్తున్నట్లు జనసేన తెలిపింది. నవ్యాంధ్రలో నెలకొన్న లోపభూయిష్ట విధానాలను రెండు పార్టీలు ఖండించాయి. 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పనిచేస్తోందని నేతలు అభిప్రాయపడ్డారు. కేవలం కక్షసాధింపు చర్యలకే పరిపాలనను పరిమితం చేసిందని విమర్శించారు. ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రభుత్వ విధానాలు కొనసాగించాలని, అమరావతి విషయంలోనూ ఇదే వర్తిస్తుందని తీర్మానించారు.
సమన్వయ కమిటీలు
రాష్ట్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ వైకాపా ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. గతంలో తెదేపా, ఇప్పుడు వైకాపా కులం, కుటుంబ రాజకీయాలు, స్వలాభాపేక్ష, అవినీతిలో కూరుకుపోయాయని విమర్శించారు. నవ్యాంధ్రకు ఉజ్జ్వల భవిష్యత్తు ఇచ్చే విధంగా భాజపా-జనసేన కూటమి పనిచేయనుందని తెలిపారు. విలువలతో కూడిన నాయకత్వం, యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇరు పార్టీలూ సమన్వయ కమిటీలు ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి: 'తెరాస మోసాలే... పుర ఎన్నికల్లో మన అస్త్రాలు'