BJP Janasena Alliance in Telangana : బీజేపీ, జనసేన మధ్య పొత్తు (BJP Janasena Alliance) కుదిరింది. శాసనసభ ఎన్నికల్లో జనసేన తొమ్మిది స్థానాల్లో పోటీ చేయనుంది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నివాసంలో కమలం పార్టీ రాష్ట్ర నాయకులు శనివారం రాత్రి జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈ సమావేశంలో పవన్ కల్యాణ్‌తో పాటు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు.
తొలుత జనసేన 11 చోట్ల పోటీ చేయాలని నిర్ణయించినా.. తాజా చర్చల్లో 9 స్థానాలకు అంగీకరించింది. కూకట్‌పల్లితో పాటు మరో 8 స్థానాల్లో జనసేన పోటీ చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ ఎన్నికల్లో రెండు పార్టీల అభ్యర్థుల విజయానికి సమష్టిగా పని చేయాలని ఈ సందర్భంగా నిర్ణయానికి వచ్చారు. ఏయే స్థానాల్లో జనసేన పోటీ చేయనుందనే అంశంతో పాటు తదుపరి కార్యాచరణను నేడు ప్రకటించనున్నారు.
ఊపందుకున్న ఎన్నికల ప్రచారం ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు
Telangana Assembly Elections 2023 : 119 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికే 88 చోట్ల అభ్యర్థులనుబీజేపీ ప్రకటించింది. మిగిలిన 31 స్థానాలకు గానూ తొమ్మిది చోట్ల జనసేన బరిలోకి దిగనుండగా.. 22 స్థానాలకు కమలం పార్టీ అభ్యర్థులను రెండు రోజుల్లో ప్రకటించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఈ నెల 7న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో పాల్గొనే బీసీ ఆత్మగౌరవ సభకు పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. ప్రధాని సభలో పాల్గొనాలని పవన్ కల్యాణ్‌ను కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌లు కోరగా.. అందుకు ఆయన అంగీకరించారు.
ఎన్డీయే భాగస్వామిగా ఉన్న జనసేన.. గతంలో జరిగిన అసెంబ్లీ, కార్పొరేషన్ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో సహకరించిందనికిషన్‌రెడ్డి (Kishan Reddy) పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ఎంతో కీలకమైనవని.. తెలంగాణ రాష్ట్రానికి డబుల్ ఇంజిన్ సర్కారు అవసరమని తెలిపారు. జనసేనతో సీట్ల సర్దుబాటు కొలిక్కివచ్చిందని కిషన్‌రెడ్డి వెల్లడించారు.