BJP Issues in Telangana Elections : బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అని చెబుతూ వస్తున్న కమలనాథులు ఎన్నికలకు ముందేచతికిలపడిపోయారు. కీలక కమిటీల బాధ్యతలు తీసుకున్న నేతలు పార్టీ మారడంతో కుర్చీలు ఖాళీ అయ్యాయి. స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగిన మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి హస్తం గూటికి చేరారు. పోరాటాల కమిటీ ఛైర్మన్‌గా పార్టీ విజయశాంతికి బాధ్యతలు అప్పగించినప్పటికీ.. ఆమె పార్టీ కార్యకలాపాలకు అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. వీటన్నింటిని కోఆర్డినేషన్ చేసుకునే బాధ్యతలు మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డికి అప్పగించింది. కానీ ఆయనను త్రిపుర గవర్నర్‌గా నియమించడంతో ఆ సీటు కూడా ఖాళీ అయింది.
ఛైర్మన్లు లేకపోతే కన్వీనర్లు అయినా బాధ్యతలు తీసుకుంటారనుకుంటే వారు కూడా తమకెందుకులే అనే ధోరణిలో ఉండిపోయారు. మేనిఫెస్టో కమిటీకి జాయింట్ కన్వీనర్‌గా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని నియమించింది. కానీ ఆయన కూడా పార్టీని వీడుతారనే ప్రచారం జరుగుతోంది. పార్టీలో సముచిత గౌరవం ఇవ్వడం లేదని అసంతృప్తితో ఉన్న మాజీ ఎంపీ విజయశాంతికి పోరాటాల కమిటీ బాధ్యతలు అప్పగించినా.. ఆమె ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒక్క నిరసన, ఆందోళన చేపట్టినదాఖలాలు లేవు. నేతలు పార్టీ మారడంతో ఖాళీ అయిన స్థానాల్లో కొత్త వారిని నియమిస్తారా? లేక అలాగే ఎన్నికలకు వెళ్తారా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
Internal Issues Of BJP In Telangana Elections :ఎన్నికల సమయంలో ప్రతి పార్టీకి మేనిఫెస్టో ఎంతో కీలకమైంది. పార్టీ గెలుపోటములను కూడా మేనిఫెస్టోనే నిర్ణయిస్తుంది. మేనిఫెస్టోను ప్రతి పార్టీ భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావిస్తుంటాయి. మేనిఫెస్టో కమిటీ బాధ్యతలు తీసుకున్న వివేక్ ఉన్నపళంగా పార్టీ మారారు. బీజేపీ మేనిఫెస్టోలో పొందు పరిచే అంశాలు దాదాపు వివేక్‌కు తెలుసు. ఇప్పుడీ అంశం కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం లేకపోలేదు. కీలక స్థానాలన్నీ పార్టీ మారిన నేతలకే ఇవ్వడంతో బీజేపీ చిట్టా మొత్తం వారి చేతుల్లో ఉంది. ఇదిబీజేపీ భవిష్యత్‌ను ప్రమాదంలో నెట్టేసే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అదే జరిగితే కమలం పార్టీకి ఊహించని దెబ్బ పడినట్లే అవుతుందని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.