కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా తెరాసనే TRS MLAS PURCHASE: తెరాస ఎమ్మెల్యేల భాజపా ప్రలోభ ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీనిపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా తెరాస ఆడుతున్న కట్టుకథగా కొట్టిపారేశారు. తెరాస ఒక పెద్ద డ్రామా కంపెనీగా అభివర్ణించిన ఆయన... ఫామ్ హౌజ్లో ఉన్నవాళ్లు భాజపా వాళ్లని ఎవరు చెప్పారని ఆయన నిలదీశారు. నలుగురు ఎమ్మెల్యేలను పోలీస్ స్టేషన్కు ఎందుకు తరలించలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా చూసుకునేందుకే ఈ నాటకం ఆడారని.. ఆయన విమర్శించారు.
ఫిల్మ్నగర్లో దక్కన్ కిచెన్ హోటల్లో ఈ మూడు రోజుల లైవ్ పుటేజీ చూపించే ధైర్యం సీఎం ఉందా.. అధికారం ఉంది ఏమైనా చేస్తారు. అలాగే ప్రగతి భవన్కు సంబంధించిన ఈ రెండు రోజుల లైవ్ పుటేజీ చూపిస్తే అందరూ బండారం బయటపడుతోంది. మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన తెరాస నాయకుడు ఈ హోటల్లోనే మూడు రోజుల నుంచి ఉన్నాడు. ఇప్పుడు ఈ లైవ్ పుటేజీలో ఉన్న ఎమ్మెల్యే ఈ మూడు రోజులు ప్రగతి భవన్కు రోజూ వెళ్లేవారు. మీకు ధైర్యం ఉంటే యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధికి రండి.. అక్కడే తెలిసిపోతుంది.
-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఈ ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే కమిషనర్ వచ్చి వీళ్లను రక్షించాడు. ఈ నలుగురు ఎమ్మెల్యేను నెత్తిన రూపాయి పెట్టిన ఎవరు కొనరు. కేసీఆర్ చిల్లర రాజకీయాలు అందరికీ తెలుసు. ఈ సంఘటనతో ఎమ్మెల్యేకు హెచ్చరిక ఇచ్చినట్లు అయ్యింది. ఈసారి ఏ ఎమ్మెల్యే అయిన ఇటువంటి పనులు చేస్తే ఇట్లానే ఉంటుంది. వాళ్ల ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. ఇటువంటివి చేస్తే మునుగోడు ఎన్నికల్లో గెలుస్తాము అనే భావనలో ఉన్నారు. తండ్రి, కొడుకులు ఆడుతున్న నాటకం ఇది. -బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
మునుగోడు ఉపఎన్నికల్లో ఓటమి భయంతో తెరాస కొత్త నాటకానికి.. తెరలేపిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. మొయినాబాద్ ఘటన... తెరాస ప్రభుత్వం ఆడుతున్న నాటకమని... దీన్ని సీరియస్గా తీసుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో భాజపా, కేంద్ర ప్రభుత్వం పాత్ర ఇసుమంతైనా లేదన్న కిషన్ రెడ్డి.. దీనిపై సీబీఐతో కానీ సుప్రీం కోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణకు సిద్ధంగా ఉన్నామన్నారు. నందకుమార్ తన అనుచరుడిగా జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని.. వందల మంది కార్యకర్తలు తనతో ఫోటోలు దిగుతుంటారనీ... వారందరితో తనకు పరిచయం ఉందంటే ఏమటి అర్థం అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ వ్యవహారం రచన, స్త్రీన్ప్లై, దర్శకత్వం అంతా ప్రగతిభవనదేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఘటన పూర్తిగా విఠలాచార్య సినిమాను తలపించే విధంగా ఉందన్నారు. కేసీఆర్ చెప్పే కథలు తెలంగాణ ప్రజలు నమ్మరని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. పోలీసులు చెప్పిన వారెవరూ.. భాజపా నేతలు కాదన్న ఆమె.. రాజకీయ మనుగడ కోసం కేసీఆర్ కొత్త నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
మొయినాబాద్ ఫాంహౌజ్ ఘటన హాస్యాస్పదంగా ఉందని... భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ్యుడు లక్ష్మణ్ తెలిపారు. మునుగోడులో తెరాస ఓడిపోతోందని కేసీఆర్కు తెలిసిపోయిందని... కట్టుకథలతో ప్రజలను మోసం చేయలేరని ఆయన పేర్కొన్నారు. ఇది కేసీఆర్, కేటీఆర్ ఆడిస్తున్న నాటకమని... నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఆరోపించారు. తెరాస గతంలో ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇటువంటి నాటకాలు ఆడుతున్నారని.. ఆయన విమర్శించారు.
ఇవీ చదవండి: