Bjp High Command Green Signal to New State Executive Committee: కాషాయ పార్టీ 'ఆపరేషన్ ఆకర్ష్'తో బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీకి చెందిన పలువురు అసంతృప్తి నేతలు బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీలో చేరిన చాలా మంది నేతలు తమకు మంచి అవకాశాలు, పదవులు దక్కుతాయని భారీ అంచనాలు పెట్టుకున్నారు. చేరి చాలా కాలమైనా ఉత్సవ విగ్రహాల్లాగే మిగిలిపోయామనే ఆవేదన వెళ్లగక్కుతున్నారు. తాజాగా హైకమాండ్ నుంచి రాష్ట్ర కార్యవర్గంలో మార్పులు, చేర్పులకు సంబంధించిన ప్రస్తావన రావడంతో అసంతృప్తిగా ఉన్న వారిలో ఆశలు మొలకెత్తాయి. తమకు ఈసారి అవకాశాలు దక్కుతాయని ఇతర పార్టీల నుంచి కమలం గూటికి చేరిన నేతలు ఆశిస్తున్నారు.
అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ: మాజీ ఎంపీలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్, కూన శ్రీశైలం గౌడ్, విక్రమ్ గౌడ్ వంటి నేతలు కాషాయతీర్థం పుచ్చుకుని చాలా రోజులవుతోంది. ఈ నేతలకు రాష్ట్ర కార్యవర్గంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చోటిచ్చే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర కార్యవర్గంలో మార్పులు, చేర్పులంటూ జరగుతున్న ప్రచారం పట్ల పలువురు బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. పార్టీ బలోపేతం కోసం పని చేయని నేతలను పక్కన పెట్టేయాలని జాతీయ నాయకత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఇక తమ ఆటలకు చెక్ పడనుందని భావిస్తున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పని చేస్తున్న కాషాయ దళం బీఆర్ఎస్కు చెక్ పెట్టి తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడమే టార్గెట్గా ముందుకు సాగుతున్నారు.