BJP focus on Telangana Assembly Elections 2023 : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్న కమలనాథులకు కన్నడ ఫలితాలు బ్రేక్ వేశాయి. కర్ణాటకలో బీజేపీ ఘోరపరాజయం చవిచూడటంతో ఆ ప్రభావం కాస్త తెలంగాణపై పడింది. అధికార బీఆర్ఎస్తో ఢీ అంటే ఢీ అంటూ బీజేపీ తలపడింది. ఒక వైపు కర్ణాటక ఫలితాల ప్రభావం.. మరోవైపు పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తోంది. ఇతర పార్టీల నుంచి కాషాయ గూటికి చేరినవారికి సముచిత స్థానం కల్పించడంలేదన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగింది.
కొంతమంది నేతలు బహిరంగంగానే విమర్శలు చేసిన పరిస్థితి. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు జాతీయ కార్యవర్గ సభ్యుడిగా అవకాశం కల్పించినప్పటికీ తన స్థాయికి ఇది సరిపోదని.. రాష్ట్ర అధ్యక్ష పదవి లేదా ప్రచార కమిటీ ఛైర్మన్ ఇవ్వాలని కోరుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ ప్రచారంతో ఈటల, బండికి మధ్య గ్యాప్ ఏర్పడింది. ఇరువురు రెండు గ్రూపులుగా విడిపోవడంతో శ్రేణులు అయోమయానికి గురయ్యాయి. ఈటలకు ప్రచార కమిటీ ఛైర్మన్ ఇస్తారన్న ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల్లో విస్తృతం చేయడంపై బీజేపీ ముఖ్య నేతల్లో ఆగ్రహాం వ్యక్తమైంది.
- JP Nadda Telangana Tour : ఈ నెల 25న తెలంగాణకు జేపీ నడ్డా రాక
- Bandi Sanjay Interesting Comments : '25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు'
ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరినటువంటి ముఖ్యనేతలు సమావేశమై ఈటల తీరుపట్ల ఆగ్రహాం వ్యక్తం చేశారు. బీజేపీలో ప్రచార కమిటీ ఉండదని బాంబ్ పేల్చారు. బీజేపీలో పదవులపై లీక్‌లు ఇచ్చే సంప్రదాయంలేదని పరోక్షంగా ఈటలకు చురకలంటారు. తరుణ్ చుగ్ సైతం మరోసారి అధ్యక్ష మార్పు ఉండదనే సంకేతం ఇచ్చారు. బండి సంజయ్ సైతం తన మార్పు ఉండదనే సంకేతాన్ని ఇచ్చేందుకు 125 మందితో రాష్ట్ర కార్యవర్గాన్ని విస్తరింపచేసుకున్నారు. మొన్నటి వరకు ఈటలతో దోస్తీ చేసిన ముఖ్య నేతలు సైతం దూరమవ్వడంతో ఒంటరయ్యాడనే ప్రచారం పార్టీలో జోరుగా నడుస్తోంది.
BJP strength in Telangana : శాసన సభ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ పార్టీ నేతల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చడంతో పాటు ఎన్నికలకు సమాయత్తమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం జంబో కార్యవర్గాన్ని ప్రకటించింది. కొత్తగా మరో 125 మంది కార్యవర్గ సభ్యులను నియమించింది. జంబో కార్యవర్గం ప్రకటనతో మరో తలనొప్పి వచ్చి పడింది. చాలా మంది నేతలు కార్యవర్గ సభ్యుడిగా ప్రకటించడం పట్ల ఆగ్రహాం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇతర పార్టీల్లో రాష్ట్ర స్థాయిలో ఉన్నత పదువుల్లో పనిచేసిన తమకు ప్రాధాన్యతలేని కార్యవర్గ సభ్య పదవి ఇవ్వడం పట్ల పెదవి విరిచారు.