Rajasingh On CM Jagan: సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్.. తాజాగా మరోసారి ఆసక్తికర కామెంట్లు చేశారు. తరచూ.. రాష్ట్ర సీఎం కేసీఆర్, కేటీఆర్‌తో పాటు తెరాస నేతలపై విరుచుకుపడే రాజాసింగ్.. ఇప్పుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌పై ధ్వజమెత్తారు. ఏపీ సీఎం జగన్ తీరుతో హిందూ దేవుళ్లకు చెడ్డపేరు వస్తోందని రాజాసింగ్ మండిపడ్డారు. తిరుపతిలోని అలిపిరి చెక్ పోస్టు వద్ద వాహనాలపై హిందూ దేవుళ్ల స్టిక్కర్లను తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర భక్తులు తీసుకోస్తున్న ఛత్రపతి శివాజీ విగ్రహాలను అనుమతించమని పోలీసులు చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ చర్యల ఫలితంగా.. మహారాష్ట్ర సోషల్ మీడియాలో బాయ్‌కాట్ తిరుపతి అంశం వైరల్ అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనంతటికీ కారణం.. జగన్ తప్పుడు నిబంధనలేనని ఆరోపించారు.
బాయ్‌కాట్ తిరుపతి అంటూ మహారాష్ట్రలో ప్రచారం జరుగుతోంది. అలిపిరి వద్ద వాహనాలపై హిందూ దేవుళ్ల స్టిక్కర్లు తొలగిస్తున్నారు. జగన్ తప్పుడు నిర్ణయాల వల్ల హిందూ దేవుళ్లకు చెడ్డ పేరు వస్తోంది. శివాజీ విగ్రహాలను అడ్డుకోవడం మహారాష్ట్రలో పెద్ద వివాదంగా మారింది. మహారాష్ట్ర సోషల్ మీడియాలో బాయ్ కాట్ తిరుపతి అనటం వైరల్ అవుతోంది. జగన్ తప్పుడు నిబంధనలే ఈ వివాదానికి కారణం. జగన్ ఏ దేవుడిని నమ్ముతారో దేశ ప్రజలకు తెలుసు.- రాజాసింగ్, భాజపా ఎమ్మెల్యే
జగన్ తీరుతో తిరుపతి, ఏపీకి చెడ్డ పేరు: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్