ఇటీవల జరిగిన ఎన్నికల్లో భాజపా ఆశించిన ఫలితాలు సాధించడంతో త్వరలో జరగబోయే వరంగల్-ఖమ్మం-నల్లగొండ, హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల స్థానాలతో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్, నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా సాగుతోంది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు. బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పదిమంది ఓటర్లకు ఒక్కరు బాధ్యత తీసుకోవాలని తరుణ్ చుగ్ సూచించినట్లు పార్టీ నేతలు తెలిపారు. సిట్టింగ్ స్థానమైన హైదరాబాద్-రంగారెడ్డి-మహాబూబ్‌నగర్‌లో భారీ మోజార్టీతో విజయం సాధించేలా కృషి చేయాలని పార్టీ నేతలకు దిశానిర్థేశం చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి.
వరుస పర్యటనలు
ఇప్పటికే వరుసగా జిల్లా పర్యటనలు చేస్తోన్న రాష్ట్ర కమలదళపతి బండి సంజయ్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్‌తో కలిసి జిల్లాల బాట పట్టారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లిన నేతలకు స్థానిక నేతలు ద్విచక్ర వాహానాల ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. అనంతరం బోధన్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇతర పార్టీలకు చెందిన పలువురు భాజపాలో చేరారు.
మీడియాతో చిట్‌చాట్
నిజామాబాద్ జిల్లా పర్యటన ముగించుకుని రాత్రి హైదరాబాద్‌కు తిరిగిరానున్నారు. రేపు ఉదయం ఆరు గంటలకు బండి సంజయ్‌తో కలిసి తరుణ్‌చుగ్ హైదరాబాద్ నుంచి ఖమ్మం బయలుదేరునున్నారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం ఖమ్మం కార్పొరేషన్, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మేధావులతో సమావేశం కానున్నారు. మేధావుల సమావేశం అనంతరం మీడియాతో చిట్‌చాట్ చేయనున్నారు.
రేపు ఖమ్మంలో పర్యటన
భోజన విరామం అనంతరం ఖమ్మం కార్పొరేషన్ బూత్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశం తరువాత ఖమ్మం, కొత్తగూడం జిల్లాల పదాధికారులతో సమావేశమవుతారు. ఈ భేటీలో పట్టభద్రుల స్థానం, కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్ధేశం చేయనున్నారు. ఖమ్మం పర్యటన ముగించుకుని వరంగల్‌కు బయల్దేరి అక్కడే రాత్రి బస చేయనున్నారు. పర్యటిస్తోన్న బండి, తరుణ్ చుగ్ స్థానిక నేతలు ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం బోధన్‌లో ఇతర పార్టీలకు చెందిన పలువురు బండి, తరుణ్ చుగ్ సమక్షంలో భాజపాలో చేరారు. రేపు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న నేతలు పార్టీ సంస్థాగత సమావేశంలో పాల్గొననున్నారు.
రాజుకున్న రాజకీయవేడి
ఈ నెల 9న తరుణ్‌చుగ్‌తో కలిసి బండి సంజయ్ మరోసారి వరంగల్‌లో పర్యటనకు వెళ్తున్నారు. ఈనెల 5న వరంగల్‌కు రాజకీయ వేడి రాజేసిన బండి సంజయ్ రెండు రోజుల వ్యవధిలోనే మళ్లీ వరంగల్‌కు వస్తుండడంతో జిల్లా ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర కార్యాలయంలో కాకుండా పార్టీ సమావేశాలు ఇక నుంచి జిల్లాల్లో నిర్వహిస్తానని ప్రకటించిన తరుణ్ చుగ్ వరంగల్‌లో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు రాష్ట్ర ప్రధానకార్యదర్శులతో సమావేశం కానున్నారు.
10న ముగియనున్న పర్యటన
ఈ సమావేశం అనంతరం వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశంలో పాల్గొంటారని పార్టీ నేతలు తెలిపారు. మధ్యాహ్నాం 12 గంటలకు మేధావులతో సమావేశమై కార్పొరేషన్, పట్టభద్రుల ఎన్నికల్లో భాజపాను గెలిపించాలని కోరనున్నారు. మధ్యాహ్నాం 3 నుంచి 4 గంటల వరకు స్థానిక మీడియాతో చిట్‌చాట్ చేయనున్నారు. సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి 7గంటల వరకు వరంగల్ కార్పొరేషన్ బూత్ కమిటీ సమావేశంలో పాల్గొని ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేయనున్నారు. వరంగల్ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌లో రాత్రి బస చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మూడు రోజుల పర్యటన ముగించుకుని 10వ తేదీ ఉదయం తిరిగి దిల్లీ వెళ్లనున్నారు.