రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా.. కమలనాథులు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల నుంచి జీహెచ్ఎంసీ వరకు అనుకూల ఫలితాలు రావడం వల్ల జాతీయ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. దక్షిణ భారతంలో కేవలం కర్ణాటకలోనే అధికారంలో ఉన్న భాజపా.. రాష్ట్రంలోనూ పార్డీ జెండా ఎగరవేసేందుకు అనుకూల పరిస్థితులున్నాయని కమలనాథులు యోచిస్తున్నారు. రాబోయే అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని.. ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పేర్లు ఖరారు..
ఈ క్రమంలో మార్చిలో జరగబోయే వరంగల్, ఖమ్మం, నల్గొండ సహా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ టికెట్‌ను ఆ పార్టీ జాతీయ నాయకత్వం రాంచందర్రావుకే తిరిగి కేటాయించింది. వరంగల్-నల్గొండ-మహబూబ్‌నగర్ పట్టభద్రుల స్థానం నుంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డిని బరిలోకి దింపాలని యోచిస్తోంది. ప్రస్తుతానికి వారిపేర్లనే జాతీయ నాయకత్వానికి రాష్ట్ర శాఖ పంపించింది.
కోదండరాంను ఎదుర్కొనేలా..
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడంతో అదే జోరును రెండు పట్టభద్రుల స్థానాల్లో కొనసాగించాలని భావిస్తోంది. ఐతే వరంగల్-నల్గొండ-ఖమ్మం నుంచి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం బరిలోకి దిగుతుండడం వల్ల ప్రేమేందర్‌రెడ్డి కాకుండా మరో బలమైన వారిని దింపాలని యోచిస్తోంది. ప్రేమేందర్‌రెడ్డి మాత్రం క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ప్రారంభించారు.